
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తన రాజకీయ భవితవ్యంపై నేడు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా జాంబాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో చర్చించి ఆయన కాంగ్రెస్‌లో కొనసాగాలా.. లేక టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలా.. అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ముఖేశ్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరాలనే ఆలోచనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.
హైదరాబాద్ కాంగ్రెస్‌లో క్రియాశీలక నాయకునిగా, మాజీ మంత్రిగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయనతో పాటు కుమారుడు విక్రంగౌడ్ కూడా పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా చాలాకాలంగా హాజరుకావడం లేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీతనయులు గైర్హాజరయ్యారు.
అయితే, పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని అనుచరుల వద్ద చెప్పుకుంటున్న ముఖేశ్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం దాదాపు ఖరారయినట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా పెద్దగా బలం లేనప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం–టీఆర్‌ఎస్ రాజకీయ అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉందని, దీంతో ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే అంచనాతోనే ఆయన కారు వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆదివారం కార్యకర్తలతో సమావేశమయిన తర్వాత ముఖేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment