
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసుకున్న తరహాలో తెలంగాణలోనూ పాగా వేద్దామని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం సూచించింది. కర్ణాటకలో మెజారిటీ సీట్లు సాధించడానికి అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడా అనుసరించాలని.. పార్టీ కార్యకర్తల నుంచి స్థానిక నేతలు, సీనియర్లు, అగ్రనేతలు అంతా కలసి ముందుకు సాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు దిశా నిర్దేశం చేశారు. ‘‘ప్రపంచంలో భారత సైన్యానికి మంచి పేరుంది. ఎందుకంటే సాధారణ సైనికులతోపాటు పైస్థాయి అధికారులు కూడా యుద్ధభూమిలో ముందుకు సాగుతారు.
కర్ణాటకలో దీనినే అనుసరించాం. ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలతోపాటు రాష్ట్రనేతలు, ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కలసి ముందుకు సాగారు. అది మంచి ఫలితాలు ఇచ్చింది. పెద్దగా ప్రజావ్యతిరేకత లేని ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు పేరున్నా.. వారి కాంగ్రెస్ పార్టీని నిలువరించగలిగాం. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి మన బలాన్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేసుకుంటూ, లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకు కదిలి.. అత్యధిక స్థానాలు సాధించగలిగాం..’’అని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా పనిచేస్తూ, బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటే బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బాటలో తెలుగు సీఎంలు..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి సిద్ధాంతాలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని మురళీధర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్టీఆర్ విధానాలను పక్కనపెట్టి చంద్రబాబు అధికారం కోసం కాంగ్రెస్‌తో కలవబోతున్నారని... కేసీఆర్ కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు. దీనిని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ పక్షాన ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అధికారాన్ని పొందలేకపోయామని, కానీ అత్యధిక స్థానాలు సాధించడాన్ని విజయంగానే భావించాలని పేర్కొన్నారు. అక్కడ భవిష్యత్తులో ప్రజాభీష్టం మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం గాని, మధ్యంతర ఎన్నికలు రావటంగానీ జరుగుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పథకాలన్నీ కమీషన్లమయమే: లక్ష్మణ్
తెలంగాణలో అధికార పార్టీ అవినీతి పెచ్చుమీరిపోయిందని, చాలా పథకాల్లో కమీషన్ల ఆధారంగానే పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమాలు మితిమీరాయని, ముఖ్యమంత్రి సైతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలరాశారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, హిందూ సంస్థలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో పలు తీర్మానాలు
తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక నాలుగేళ్ల మోదీ పాలనను అభినందిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ కార్యశాల తదితర కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి నివేదిక సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment