
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలను విస్మరించిందని, రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు కానున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని, తమ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పారని, అయితే ఇప్పుడు ఎన్నికలు డిసెంబర్‌లో వస్తున్నాయన్నారు. దీనిలాగే రానున్న రోజుల్లో కేసీఆర్ అంచనాలన్నీ తలకిందులు కానున్నాయని తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ తన మాట లతో ప్రజలను నమ్మించలేని పరిస్థితిలో పడ్డారన్నారు. కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యగా పేర్కొన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, అంబేడ్కర్ విగ్రహం, మాదిగ భవన్ ఏర్పాటు వంటి హామీలు అమలు చేయలేదని చెప్పారు. ఇసుక మాఫియాతోనే ప్రభుత్వాన్ని నడిపారని మండిపడ్డారు. రాష్ట్రంలో 10 శాతం ఎస్టీలు ఉంటే.. ఒక అడుగు ముందుకు వేసి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జి్జషీట్ తయారు చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment