సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌పై పోరుకు తమ పార్టీ అధినాయకత్వం పచ్చజెండా ఊపిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు తెలిపారు. ఆ పార్టీపై పోరాడేందుకు మండలస్థాయిలో చార్జ్‌షీట్ యాత్రలు చేపట్టనున్నామని చెప్పారు. తెలంగాణలో శాసనసభకు ఎన్నికలు ముందస్తుగా వచ్చినా, ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా సంస్థాగతంగా, క్రమబద్ధంగా క్షేత్రస్థాయి నుంచి పైవరకు పార్టీని బలోపేతం చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్ 2న టీఆర్‌ఎస్ జరిపిన బహిరంగ సభలో వాగ్దానాలపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్చ చేయలేదని, చర్చ జరపకపోవడమే టీఆర్‌ఎస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతి మండలంలో ఈ యాత్రలు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికిగాను ఆ పార్టీపై పోరాడేందుకు కేంద్ర నాయకత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా క్యాలెండర్ తయారీపై కూడా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా చర్చించారని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ పోరాట బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొనబోతున్నట్టు తెలిపారు.
రానున్న రోజుల్లో బీజేపీ అటు రాజకీయంగా, ఇటు సంస్థాగతంగా తెలంగాణలో ప్రత్యామ్నాయ దిశలో, స్వతంత్ర పంథాలో ముందుకు సాగుతుందని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీయే అన్న రీతిలో వెళుతుందని తెలిపారు.టీఆర్‌ఎస్‌తో కలసి వెళుతున్నట్టు ప్రజలకు సంకేతాలు వెళ్లాయన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా ‘పోరాటం చేస్తామంటున్నాం.. పొత్తు లేదని చెబుతున్నాం.. మళ్లీ అందులో బహిరంగ పొత్తు, లోపాయికారీ పొత్తు అనేవి ఉండవు’అని ఆయన స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు వెళ్దామని ప్రధాని పిలుపునివ్వగా టీఆర్‌ఎస్ ముందస్తుకు ఆసక్తి చూపడంపై స్పందన కోరగా ‘ముందస్తుకు వెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే పార్టీ నిర్ణయం. వారిష్టం..’అని అన్నారు. ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రి ఈ అంశాలు చర్చించలేదని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌పై పోరుకు బీజేపీ సై
Published Wed, Sep 5 2018 2:42 AM | Last Updated on Wed, Sep 5 2018 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment