సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదని.. ఇన్‌పుట్ సబ్సిడీలు కూడా చెల్లించలేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గిందని వివరించారు. రైతు దంపతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొన్న పరిస్థితుల్లో.. గవర్నర్ ప్రసంగంలో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పడం దారుణమన్నారు. రైతు కంట కన్నీరు మంచిది కాదని చంద్రబాబుకు నాగిరెడ్డి సూచించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎజెండా ఫిక్స్ చేస్తే చంద్రబాబు ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలలో వైఎస్ జగన్ రైతులకు ఏం చేయబోతున్నామనే దానిపై స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి ఐదేళ్ల పాలనే అందిస్తాను అని ఎన్నికలకి వెళ్లే ధైర్యం ఉందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించిన రోజు సాధ్యం కాని హామీలు ఇచ్చారన్న చంద్రబాబు ఇప్పుడు అవే అమలు చేస్తున్నారని నాగిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment