వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి(పాత చిత్రం)
అమరావతి: టీడీపీ అరాచకాలకు పాల్పడిన చోట రీపొలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంవీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల మీద పడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పోలింగ్ సరళి చూసి బెంబేలెత్తిన చంద్రబాబు టీడీపీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొని పోలింగ్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా అని సూటిగా బాబును అడిగారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వంలో నియమించిన అధికారులు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించమని కోరినట్లు తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల్లో 5శాతం వాటిపై కూడా ఈసీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. చంద్రబాబు పాచికలు పారకపోవడంతో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలతో ఓటింగ్ శాతం తగ్గించే కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట రీపోలింగ్ నిర్వహించాలని సీఈఓని కోరామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment