సాక్షి, అమరావతి: డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సుధాకర్ వెనుక ఏదో పెద్ద సపోర్టు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆయన చెప్పారు. హైకోర్టు మంచిపనే చేసిందని, లేదంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాబట్టి వారికి ఇష్టమొచ్చినట్టుగా ఎఫ్‌ఐఆర్ రాసుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఎవరి తప్పు ఏంటో సీబీఐ విచారణలో బయటకు వస్తాయన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సురేష్ విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాలముందే చంద్రబాబుకు తెలుస్తుంది. మొదట చంద్రబాబును విచారించాలి. ఆయన కాల్ లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా.
► కోర్టు తీర్పు సందర్భంగా పదిమంది టీడీపీ దళిత నేతలు పరిగెత్తుకొచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ మాట్లాడారు. వారు వెనక్కు తిరిగి చూస్తే.. చంద్రబాబు దళితుల గురించి ఏం మాట్లాడారో.. వారికే అర్థమవుతుంది. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. దళితులు చదువుకోరని, శుభ్రంగా ఉండరని టీడీపీ మంత్రులు అప్పట్లో మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని టీడీపీలోని దళిత నేతలే మాట్లాడడం విడ్డూరం.
► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే.. ఆయన ఫొటోకు దండ వేసినట్టుగా.. దళితుల్ని అవమానించే టీడీపీనే ఆ పార్టీ దళిత నేతలు వెనకేసుకురావడం శోచనీయం.
► చంద్రబాబు వ్యవస్థలను, హైకోర్టును మేనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈరోజున తీర్పు వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నారు. ఎంతసేపూ మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డెక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. దీనికేమంటారు?
సుధాకర్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు
► సుధాకర్ ముఖం మీద దళితుడు, డాక్టర్ అని రాసి ఉండదు. వాస్తవానికి అక్కడ పోలీసుల ఓపికకు దండం పెట్టాలి. శాడిస్టులా బూతులు మాట్లాడుతూ, కార్ల కింద చొరబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి చంద్రబాబు సపోర్టు చేస్తున్నారు. సుధాకర్‌ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు.
► ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. పరిపాలన కుంటుపడేలా తీర్పులు తేవాలని తయారయ్యారు. ప్రజలు ఓడించి ఇంటికి పంపినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు. ఆయనది క్రిమినల్ మైండ్. బాబు కుట్రలను సాగనివ్వం. ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా విజయం మాదే.
Comments
Please login to add a commentAdd a comment