అది 2018 జులై...మంత్రి లోకేశ్ (చినబాబు) కర్నూలు వస్తున్నారని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి తెగ హడావుడి చేశారు. నారావారి రాజకీయ వారసుడి కరుణా కటాక్షాల కోసం తాపత్రయ పడ్డారు. పెద్ద వేదిక వేసి, జన సమీకరణ చేసి ‘మా రాజువి నీవయ్యా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో చినబాబు మురిసిపోయి ‘ముగాంబో ఖుష్ హువా’ అన్నట్లుగా పోజు పెట్టారు. అదే ఊపులో ఇంకాస్త ముందుకెళ్లి ఎక్కడికో వెళ్లిపోయి ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని’ ప్రకటించేశారు. ఇంకేముంది...నారా వంశ కిశోరం ప్రకటించిన తొలి అభ్యర్థులం తామే కాబట్టి సంబరపడ్డారు.
తరువాత 9 నెలలు గడిచాయి..
ఎన్నికల తరుణం వచ్చింది. చంద్రబాబు నుంచి మాటాముచ్చట లేదు. లోకేశ్ నుంచి ఉలుకుపలుకు లేదు. చినబాబు తమకు టికెట్లు ప్రకటించారని గుర్తుచేసినా పెదబాబు పెదవి విప్పలే. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచినా... మీ ప్రలోభాలకు లొంగి వచ్చామన్నా పట్టించుకోలేదు. తాను జీవితంలో ఎప్పుడూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని, అసలది తమ డిక్షనరీలోనే లేదన్నట్లు చంద్రబాబు మనసులో ఓ చిన్న నవ్వు నవ్వారు. తన గురించి తెలిసీ నమ్మి రావడం మీ తప్పే అన్నట్లు ఓ చూపు చూశారు. చివరగా బుట్టా, ఎస్వీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. మీ వారసుడు లోకేశ్ ‘తొలిసారి ప్రకటించిన అభ్యర్థులం మేము... మీరు కాదనడానికి లేదు కదా’ అని పరోక్షంగా చెప్పారు. కానీ, అక్కడ ఉన్నది చంద్రబాబు. కమిట్‌మెంట్లు, సెంటిమెంట్లు ఏమాత్రం లేని ఆయన ‘నా లెక్కలు నాకుంటాయి. మీ తిప్పలు మీరు పడండని’ చెప్పేశారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసే కోట్ల, టీజీ కుటుంబాలతో డీల్ సెట్ చేసుకున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి, ఎమ్మెల్యే టికెట్ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్‌కు ఇస్తామని సంకేతాలిచ్చారు. విషయం అర్ధమైన బుట్టా రేణుక మూడ్రోజుల క్రితం మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, లోకేశ్‌లను ప్రాధేయపడ్డారు. ఈయన భయపడినంతా అయింది. ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా బాబు ఝలక్ ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్‌ను ఎంపిక చేశారు. మోసపోయానని తెలిసిన మోహన్‌రెడ్డి హతాశుడయ్యారు. ఐదేళ్ల క్రితం తనకు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చేసిన ద్రోహం గుర్తుకొచ్చి ఆయన మనసు కకావికలమైంది.
మరంతేమరి...
‘చంద్రబాబు మాట మీద నిలబడరని అందరికీ తెలుసు. చినబాబైనా అలా చేయరని ఆశించాం. ఆయనకూ మాట ఇవ్వడమే తప్ప నిలబెట్టుకోవడం చేత కాదని తెలిసిందని’ ఎస్వీ మోహన్‌రెడ్డి లబోదిబోమంటున్నారు. మరోవైపు బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లు దక్కకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ‘మనవాడు నాలుక మామూలుది కాదు. ఐరన్ టంగ్. ఏదైనా చెబితే అది అయ్యేదే లేదు. అదే మరి లోకేశ్ అంటే!’ అంటూ జోకులు పేలుస్తున్నారు. – వడ్డాది శ్రీనివాస్,సాక్షి , అమరావతి
Comments
Please login to add a commentAdd a comment