సాక్షి ప్రతినిధి, కాకినాడ:
ఆర్థిక శాఖా మంత్రిగా ‘లెక్క’ల్లోకి తీసుకుంటున్న యనమల రామకృష్ణుడిని జిల్లాలో మాత్రం ‘లెక్కలో’ లేని వ్యక్తిగా తీసిపారేస్తున్నట్టుగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. చినబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించాక పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమలను వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. అధిష్టానం వేస్తున్న ఎత్తులకు అనుగుణంగా జిల్లాలో యనమల ప్రత్యర్థి వర్గం పైఎత్తులు వేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
ఆయన ఏది చెప్పినా దానికి భిన్నంగా అధిష్టానం చేస్తూ పోతుండడంతో మంత్రి అనుచరులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకుంది. ఈ మూడేళ్లలో ఆయన అనుకున్న వాటిలో పార్టీ ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం ఒక్కటే నెరవేరింది. మిగతావన్నీ బెడిసికొట్టాయి. ఆ మధ్య కార్తికేయ మిశ్రాను వద్దని యనమల చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్‌గా నియమించారన్న వాదనలు ఉన్నాయి.
జెడ్పీపై బెడిసికొట్టిన యత్నాలు...
ఇటీవల జ్యోతుల నవీన్‌ను జెడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసంతృప్తిని రాజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. యనమల అభిప్రాయానికి భిన్నంగా నామన రాంబాబును బలవంతంగా రాజీనామా చేయించి, జ్యోతుల నవీన్‌ను జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టింది. దీం తో యనమల అనుచర వర్గమంతా నిరాశకులోనై తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. ఆ తర్వాత అన్నవరం దేవస్థానం ఈఓ విషయంలో కూడా యనమల వర్గానికి మొండి చేయి ఎదురైంది. ముఖ్యం గా యనమల సిఫార్సు చేసిన పూర్వపు ఈఓ, ప్రస్తుత పెనుగంచి ప్రోలు ఈఓ రఘునాథ్ ఇక్కడికి రాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు చెక్ పెట్టారు.
మేయర్ విషయంలోనూ అంతే...
కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో మరో సారి యనమలకు చుక్కెదురైంది. తాను చెప్పినోళ్లకే మేయర్ పదవి ఖరారవుతుందని అనుచరుల వద్ద చెప్పుకున్నప్పటికీ అధిష్టానం సీల్డ్ కవర్ రాజకీయంతో పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ విషయంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారి బంధు త్వ నేతలు చక్రం తిప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ తోట నర్సింహం ఆధ్వర్యంలో యనమల ప్రత్యర్ధి నేతలంతా ఒక్కటై అధిష్టానం స్థాయిలో తమదే పైచేయి అనిపించుకున్నారు.
డీఎస్పీ పోస్టు కూడా వేసుకోలేని దుస్థితి..
తాజాగా కాకినాడ డీఎస్పీ పోస్టు విషయంలో య నమల మాట చెల్లుబాటు కావడం లేదు. కాకినాడ డీఎస్పీగా పనిచేసిన ఎస్.వెంకటేశ్వరరావుకు బది లీ తప్పని సరయింది. రెండు నెలల క్రితం కొవ్వూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. వాస్తవానికైతే, ఈ పోస్టులో తనవారినొకర్ని వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరికి యనమల చెబితే ఏదీ కాదనే సంకేతాలను క్యాడర్‌లోకి పంపిస్తోందని, ఇదంతా చినబాబు డై రెక్షన్‌లోనే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.