ఎన్నిసార్లు చెప్పాలి.. | Nara Lokesh Intolerance In Kurnool Tour | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు చెప్పాలి..

Published Tue, Jul 10 2018 12:08 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

Nara Lokesh Intolerance In Kurnool Tour - Sakshi

జెడ్పీ చైర్మన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న లోకేష్‌

కర్నూలు : ‘ఇప్పటికే ఆలస్యమైంది. భవనం ప్రారంభించాం కదా? ఎన్నిసార్లు చెప్పాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ అసహనం వ్యక్తం చేశారు.  ఆయన సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో రూ.3.67 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ నూతన పరిపాలన భవనాన్ని,  పక్కనేఏర్పాటు చేసిన గౌతమబుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ భవనాన్ని పరిశీలించాలని కోరగా, లోకేష్‌ అసహనం వ్యక్తం చేశారు. మెట్లు ఎక్కేందుకు కూడా ఇష్టపడకుండానే వెనుదిరిగారు. లోకేష్‌ వస్తున్నారని మూడు రోజులుగా జెడ్పీ చైర్మన్‌తో పాటు అధికారులు, సిబ్బంది రాత్రీ పగలు కష్టపడి భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి జెడ్పీటీసీ సభ్యులను పరిచయం చేయాలని, నాల్గో తరగతి ఉద్యోగులకు యూని ఫాం ఇప్పించాలని, నూతన భవనంలోని తన చాంబర్‌లో మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలని చైర్మన్‌ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే.. సమయం లేదంటూ మంత్రి ఒకానొక సందర్భంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌లో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకపోవడంతో సంబంధిత అధికారులు, జెడ్పీ పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 

మాతా శిశు భవనం ప్రారంభం
కర్నూలు సర్వజన వైద్యశాలలో రూ.24 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మాతాశిశు భవనాన్ని మంత్రి లోకేష్‌  ప్రారంభించారు. దీంతో పాటు రూ. 6.57 కోట్లతో నిర్మాణం కానున్న ఆధునిక బర్న్స్‌వార్డు, రూ.22 కోట్లకు పైగా నేషనల్‌ అక్రిడియేషన్‌ బోర్డు హాస్పిటల్స్‌ నిధులతో చేపట్టబోయే అప్‌గ్రేడెడ్‌ పనులకు శంకుస్థాపన చేశారు.  గైనిక్‌వార్డులో ప్రసవించిన బాలింతలకు బేబీ కిట్లను అందజేశారు. అంతకుముందు జోహరాపురం వద్ద రూ.17 కోట్లతో హంద్రీ నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి, రూ.కోటి అంచనాతో 5వ వార్డు జమ్మిచెట్టు వద్ద హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ.1.50 కోట్ల అంచనాతో 6వ వార్డు కమేళా వద్ద ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా కళాశాల మైదానంలో  మైనారిటీ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, పెళ్లికుమార్తెలకు ‘దుల్హన్‌’ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉన్నా అభివృద్ధి  కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో డిసెంబరులో జరిగే ఇస్తెమాకు పంచాయతీరాజ్‌ శాఖ తరఫున మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం నందికొట్కూరు మం డలం బ్రాహ్మణకొట్కూరులో  గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి అఖిలప్రియ, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్, వైస్‌ చైర్మన్‌ పుష్పావతి, ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, వీరభద్రగౌడ్, కే మీనాక్షినాయుడు, మాండ్ర శివానందరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement