పేట..ది పొలిటికల్‌ సెంటర్‌ | narasaraopet Has an Indelible Impression Of State And National Politics. | Sakshi
Sakshi News home page

పేట..ది పొలిటికల్‌ సెంటర్‌

Published Wed, Mar 20 2019 7:02 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

narasaraopet Has an Indelible Impression Of State And National Politics. - Sakshi

సాక్షి, గుంటూరు :జిల్లాలో ప్రముఖ విద్యాకేంద్రంగా, చైతన్యవంతమైన రాజకీయాలకు పేరు పొందిన నరసరావుపేట దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాకలు తీరిన రాజకీయ యోధులకు నరసరావుపేట పెట్టింది పేరు. ఇక్కడి నుంచి పోటీచేసి గెలిస్తే మంచి పదవులు వస్తాయన్న పేరుంది. 

నియోజకవర్గం ప్రత్యేకతలు...
వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పొగాకుతో పాటు వరి, కంది పంటలను ఎక్కువగా పండిస్తారు. రెడ్డి, కమ్మ, బీసీ, ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. రైతులు, రైతుకూలీలు, వ్యాపారవర్గాలు, ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తారు. 

ముగ్గురు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే..
ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలుపొందిన కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, రోశయ్యలు  సీఎంలుగా పనిచేశారు. పునర్విభజనకు ముందు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్లతోపాటు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలు నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఉండేవి. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. 2009కి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో కంభం, దర్శి, మార్కాపురంలను తొలగించి గుం టూరు జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను ఈ పార్లమెంట్‌లో కలిపారు. తొలి ఎంపీ సీఆర్‌ చౌదరి, ప్రస్తుత ఎంపీ రాయపాటి సాంబశివరావు

స్వతంత్రుడే మొట్టమొదటి ఎంపీ
‘పేట’ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొట్టమొదటి ఎంపీగా 1952లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సీఆర్‌ చౌదరి గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున మద్ది సుదర్శనం, కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డిలను రెండుసార్లు చొప్పున ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. 1952 నుంచి 2014 వరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 9 సార్లు గెలిస్తే, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు.

1998లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 1999లో మరో మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దనరెడ్డి, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వరుసగా కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1984లో టీడీపీ ఆవిర్భావంతో అప్పటి రాజకీయ ఉద్ధండులు కాసు బ్రహ్మానందరెడ్డిపై టీడీపీ తరఫున కాటూరి నారాయణస్వామి గెలుపొందగా, 1996లో కాసు వెంకటకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యరి సైదయ్య గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలశౌరిపై టీడీపీ అభ్యర్థి వేణుగోపాలరెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2014లో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాయపాటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిపై విజయం సాధించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి...
టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు మళ్లీ పోటీ చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయలు బరిలో నిలిచారు. రాయపాటి ఎంపీగా ఉన్న ఐదేళ్లూ నియోజకవర్గానికి దూరంగా ఉండటం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తోపాటు ఆయన కుమార్తె, కుమారుడు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, భూకబ్జాలు పార్టీ కొంప ముంచుతాయేమోననే భయం ఆ పార్టీశ్రేణుల్లో ఉంది. 

చక్రం తిప్పనున్న శ్రీకృష్ణుడు...
విలక్షణమైన తీర్పు నివ్వడంలో నరసరావుపేట ఓటర్లు ఎప్పుడూ ముందుంటారు.  వైఎస్సార్‌సీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఆయన కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రచారం ఉధృతం చేశారు. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీ సంఖ్యలో శ్రీకృష్ణ దేవరాయలు  సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో  ఆయన గెలుపు ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

సమాధిరాళ్లు...
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వరికపూడిశెల గ్రామం వద్ద 1998లో అప్పటి సీఎం చంద్రబాబు వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పథకం ద్వారా మొదటి దశలో 5వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. మలి విడతలో మొత్తం 45వేల ఎకరాలకు సాగునీరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 5 మండలాల పరిధిలోని 38 గ్రామాలకు తాగునీరు అందించేలా అధికారులు పథకానికి రూపకల్పన చేశారు.

అయితే 1998 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ పునాది రాయిని సమాధిరాయిగా మార్చారు. ఎన్నిసార్లు అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదు. దీంతో 2004 ఎన్నికల్లో మాచర్ల ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీతో వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చొరవతో 2008 జూన్‌ 6న దివంగత మహానేత వైఎస్సార్‌ తిరిగి ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. అయితే మహానేత అకాల మరణంతో పథకం ఆగిపోయింది.

ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి  కూడా చూడలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తి చేయిస్తారంటూ అక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో ఆ నియోజకవర్గ ప్రజలంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. దుర్గి మిర్చియార్డును పూర్తి చేస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు.

వైఎస్‌ హయాంలో అభివృద్ధి ఆనవాళ్లు
- నరసరావుపేటలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు 2008లో అప్పటి సీఎం వైఎస్సార్‌ పరిష్కారం చూపారు. రూ.44కోట్ల వ్యయంతో నరసరావుపేట పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల,  గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి చలించిన వైఎస్సార్‌ గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్లకు మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేశారు. గురజాల్లో సైతం బుగ్గవాగు నుంచి  రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని గురజాల ప్రజలకు అందించి వారి దాహార్తిని తీర్చారు.
- సత్తెనపల్లిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగుచేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించి రెండుపూటలా మంచినీరు అందించారు.
- వినుకొండ నియోజకవర్గంలో రూ.30 కోట్ల వ్యయంతో సిమెంట్‌రోడ్లు, సైడుకాల్వలు, పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ వంటి పనులను పూర్తిచేయించారు. తద్వారా  పట్టణంలో మౌలికవసతులు కల్పించి ప్రజల మన్ననలు పొందారు.
- చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌ హయాంలో ఇంటిగ్రేటెడ్‌ హౌసింగ్‌ అండ్‌ సొసైటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద రూ.16.74 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించి పట్టణంలోని మురికివాడల్లో మౌలికవసతులు కల్పించారు.

రాయపాటికి తలపోటు
2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటికీ నర్సరావుపేట కేంద్రంగా సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఐదేళ్లపాటు రాయపాటి ఉన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులపై సొంతపార్టీ నేతలే అసమ్మతితో ఊగిపోతుండటం రాయపాటికి నిద్రపట్టకుండా చేస్తోంది. ఇలా అన్ని చోట్లా టీడీపీకి సహకరించబోమంటూ అభ్యర్థులను వ్యతిరేకించే నాయకులు వ్యాఖ్యానిస్తుండటంతో రాయపాటి తలపట్టుకుని కూర్చున్నారు. 
నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో మొత్తం ఓటర్లు  1601271
పురుష ఓటర్లు  7,90,062
మహిళా ఓటర్లు   8,11,019
ఇతరులు 190 

  – నక్కా మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement