rayapati sambashivarao
-
'దొంగలు..' బాబో!
ఇనుము, ఇసుక లాంటి భారీ మెటీరియల్‌ను తరలించాలంటే పెద్ద వాహనాలు తప్పనిసరి. లారీ, ట్రక్కు లేకపోతే ట్రాక్టర్ వంటి వాహనాల్లోనే వాటిని తరలిస్తారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి టన్నుల కొద్దీ ఉక్కును ద్విచక్ర వాహనాలపై తరలించారంటే అది దోపిడీల్లో నేర్పరులకే సాధ్యం. అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికే సాధ్యమైంది. స్కూటీలో పోలవరం స్టీల్...!! స్టీల్, ఇసుక లాంటి భారీ మెటీరియల్ తరలించాలంటే ఎక్కడైనా డీసీఎం, లారీ లాంటి పెద్ద వాహనాలు తప్పనిసరి. ఓ ఇల్లు కట్టాలన్నా నిర్మాణానికి వాడే బరువైన ఇనుము, ఇతర మెటీరియల్‌ను పెద్ద వాహనంలోనే తరలిస్తారు. పోనీ కనీసం ట్రాక్టరైనా వాడతారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం ద్విచక్ర వాహనాలపై టన్నుల కొద్దీ ఉక్కు తరలించారంటే నమ్మాలి మరి! ఇవే కాదు.. విచిత్రంగా ఇక్కడ ఆటోలు, కార్లలో వందల టన్నుల స్టీల్ తరలించినట్లు చూపించారు! సిమెంట్, ఇసుక, స్టీల్ తరలించడంలో రాయపాటి స్టైలే వేరు మరి..!! అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికి మాత్రమే సాధ్యమైంది. సీబీఐ ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. చంద్రబాబుకు మరో సన్నిహితుడైన సుజనా చౌదరి బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టడంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులను బురిడీ కొట్టించడంలో వీరిద్దరూ ఆరితేరినట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. తిరుచానూరు అమ్మవారికి 8 కిలోల బంగారం, వజ్రాలతో నేసిన చీరను సమర్పిస్తున్న రాయపాటి, చెరుకూరి శ్రీధర్(ఫైల్) ఫోరెన్సిక్ ఆడిట్లో... పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల కాంట్రాక్టు పనుల పేరుతో 14 జాతీయ బ్యాంకుల నుంచి రూ.7,153.62 కోట్ల రుణం తీసుకున్న రాయపాటి తన సంస్థ ‘ట్రాన్స్ట్రాయ్’లో పనిచేస్తున్న వారి పేర్లతో ఏకంగా తొమ్మిది కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ కొనుగోళ్లతో రూ.6,202.82 కోట్లను మింగేశారు. ఇందులో రూ.350.49 కోట్లను రాయపాటి తన భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్ వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా మళ్లించి స్వాహా చేయడం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమైందని సీబీఐ తేల్చింది. ట్రాన్స్ట్రాయ్ తరఫున రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్, లీలాకుమారి రుణం తీసుకుని చెల్లించకుండా మోసగించడంపై కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వీరభద్రారెడ్డి ఈనెల 15న ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్ ఇళ్లు, కార్యాలయాలపై ఈనెల 18న సోదాలు నిర్వహించింది. ఎఫ్ఐఆర్లో రాయపాటి అక్రమాలను సీబీఐ బట్టబయలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్లో ప్రధానాంశాలు ఇవీ.. ప్రణాళికతో బ్యాంకుల దోపిడీ.. రాయపాటి 2001లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్(టీఐఎల్) జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కాంట్రాక్టు పనులను చేపడుతోంది. 2013లో పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణాన్ని ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ట్రాన్స్ట్రాయ్కు రూ.9394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో రూ.7153.62 కోట్ల రుణాన్ని రాయపాటి తీసుకున్నారు. రాయపాటి తన సంస్థలో పనిచేసే వారి పేర్లతో తొమ్మిది నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి నుంచి ఇనుము, సిమెంటు, కంకర, యంత్రాలు, వాహనాలు, పరికరాలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి రూ.7153.62 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం నుంచి చెల్లించేశారు. ఆ తర్వాత ఆ తొమ్మిది సంస్థల నుంచి రూ.6,202.82 కోట్లను ట్రాన్స్ట్రాయ్ ఖాతాలోకి మళ్లించి స్వాహా చేశారు. నకిలీ కొనుగోళ్లు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో పనిచేసే సుధాకర్‌బాబు పేరుతో పద్మావతి ఎంటర్ప్రైజెస్, మాజీ డైరెక్టర్ సాంబశివరావు మలినేని పేరుతో యూనిక్ ఇంజనీర్స్, వేములపల్లి హరీష్‌బాబు పేరుతో బాలాజీ ఎంటర్‌ప్రైజస్, కొరివి శివకుమార్ పేరుతో రుత్విక్ అసోసియేట్స్‌ను ఏర్పాటు చేయించిన రాయపాటి ఆ సంస్థల ఖాతాల్లోకి రూ.686.55 కోట్లను కనీసం జమ చేయకుండానే అంతే విలువైన వస్తువులను ఆ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపి మింగేశారు. ఇదిగో ఆ చిట్టా.. ► పద్మావతి ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.2,172.75 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు రాయపాటి చూపించారు. కానీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ టిన్ నెంబర్ 36200282035 పరిశీలిస్తే ఆ టిన్ నెంబర్‌తో ఎలాంటి సంస్థ ఏర్పాటు కాలేదని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ► బాలాజీ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.1,865.47 కోట్ల వస్తువులను ట్రాన్స్ట్రాయ్ కొనుగోలు చేసినట్లు చూపింది. కానీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ సంస్థ టిన్ నెంబర్‌తో ఈ కొనుగోళ్లు జరిపినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో స్పష్టమైంది. ► రుత్విక్ అసోసియేట్స్ నుంచి రూ.1925.86 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ అలాంటి లావాదేవీలు జరగలేదని ట్రాన్స్ట్రాయ్ రికార్డుల్లో వెల్లడైంది. దీన్ని బట్టి అవన్నీ బోగస్ లావాదేవీలన్నది స్పష్టమవుతోంది. ► యూనిక్ ఇంజనీర్స్ నుంచి సంస్థ యజమాని ఎం.సాంబశివరావు పాన్ నెంబర్ ఏఎఫ్కేపీఎం1706ఎల్‌నే టిన్ నెంబర్‌గా చూపించి రూ.672.12 కోట్ల విలువైన వస్తువులు కొన్నట్లు చూపారు. ఈ సంస్థ నుంచి కొనుగోలు చేసిన సరుకును తరలించడానికి వినియోగించిన వాహనాల నెంబర్లను పరిశీలిస్తే అందులో అధిక శాతం ద్విచక్ర వాహనాలుగా తేలింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో రూ.1,527.10 కోట్లు స్వాహా.. బోగస్ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండానే చేసినట్లు చూపిన ఇనుము, సిమెంటు, కంకర, వాహనాలు లాంటి వాటిలో రూ.1,753.82 కోట్ల విలువైన సరుకు నిల్వ ఉన్నట్లు ట్రాన్స్ట్రాయ్ చూపించింది. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టు వద్దే రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రి నిల్వ చేసినట్లు చూపారు. ఇంత భారీ ఎత్తున ఒక ప్రాజెక్టు వద్ద సరుకును ఎలా నిల్వ చేస్తారని సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. పోలవరంలో పనులు సబ్ కాంట్రాక్టర్లే చేశారు. ట్రాన్స్ట్రాయ్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ట్రాన్స్ట్రాయ్ రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రిని పోలవరం పనుల కోసం కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు చూపడమంటే ఆమేరకు దోపిడీ చేసినట్లు స్పష్టమవుతోంది. దొంగ లెక్కలతో రూ.907.10 కోట్లు లూటీ.. ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆదాయ, వ్యయాలపై బ్యాలెన్స్ షీట్‌ను దొంగ లెక్కలతో భారీగా పెంచేసింది. వస్తువులు కొనకుండానే అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.907.10 కోట్లను రాయపాటి లూటీ చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ట్రాన్స్ట్రాయ్ 24 ఎక్సవేటర్లను రూ.34.06 కోట్లకు కొన్నట్లు చూపింది. కానీ 8 ఎక్సవేటర్లను వోల్వో ఇండియా నుంచి కొనుగోలు చేసింది. మిగతా 16 కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు మింగేసింది. మరో 8 ఎక్సవేటర్లను రూ.14.67 కోట్లకు కొనుగోలు చేసినట్లు చూపింది. ఇందులో ఒకటి టాటా హిటాచీ, మూడు ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసినట్లు చూపింది. మిగతా నాలుగు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు కాజేసింది. పది టిప్పర్లను టాటా సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు ట్రాన్స్ట్రాయ్ చూపింది. నిజానికి ఐదు వాహనాలను మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన ఐదు వాహనాలకు ఇవే ఛాసిస్ (లారీ బాడీ నెంబర్) నంబర్లు చూపించి నిధులను మింగేసింది. వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయించకపోవడం గమనార్హం. నకిలీ వాహనాలు రయ్.. రయ్! ► యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థ నుంచి 25.50 టన్నుల 10 ఎంఎం ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి ఏపీ 12వీ 5408 నెంబరు బజాజ్ ఆటోలో పోలవరం పనులకు తరలించినట్లు చూపించారు. ► పద్మావతి ఎంటర్ప్రైజెస్ నుంచి 16.60 మెట్రిక్ టన్నుల 10 ఎంఎ ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి కేఏ 03 6894 నంబర్ కలిగిన టీవీఎస్ స్కూటీలో తరలించినట్లు చూపారు. ఇంత ఇనుము ఓ చిన్న స్కూటీపై తరలించగలగడం ఎవరికైనా అసాధ్యమే కానీ ఘనాపాటి రాయపాటికి మాత్రం కాదు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.450 కోట్ల షేర్లు ఎవరైనా కొనగలరా? ట్రాన్స్‌ట్రాయ్‌లో రాయపాటి భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌లు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 2012 – 2014 మధ్య రూ.450 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ద్విచక్రవాహనాలపై అనేక మెట్రిక్ టన్నుల స్టీల్ తరలించినట్లు చూపిన నకిలీ బిల్లులు -
వాళ్లు మాల్యా, దావూద్‌లను మించిపోయారు
సాక్షి, అమరావతి : మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకుల నుంచి లూటీ చేస్తే.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎందుకు నోరు మెదపలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకుని తినడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు. టీడీపీ నేతలు.. మాల్యా, దావూద్‌లను మించిపోయారని మండిపడ్డారు. రాయపాటి సాంబశివరావు చేసిన అవినీతిలో బాబు వాటా ఎంత?.. తెలుగుదేశం పార్టీ వాటా ఎంతో చెప్పాలి?.. పోలవరం కాంట్రాక్టు ధారాదత్తం చేసింది చంద్రబాబు కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రాన్స్ట్రాయ్పై డీఆర్‘ఐ’
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక అక్రమాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్) పనులు చేసిన బావర్‌కు.. కాఫర్ డ్యామ్‌ల పునాది (జెట్ గ్రౌటింగ్) పనులు చేసిన కెల్లర్ సంస్థకు బిల్లుల చెల్లింపులో ట్రాన్స్ట్రాయ్ నిబంధనలను అతిక్రమించడంపై ప్రధానంగా దర్యాప్తునకు సిద్ధమైంది. తమ దేశ సంస్థలకు ట్రాన్స్ట్రాయ్ ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించేలా చూడాలని డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్)కు, పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)కి జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది. ట్రాన్స్ట్రాయ్ వద్ద ఆ రెండు సంస్థలు సబ్ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని.. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడిందని, వాటితో తమకు సంబంధం లేదని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. పీఎంవోకూ ఇదే అంశాన్ని నివేదించింది. దీంతో 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆదేశించడంతో డీఆర్ఐ రంగంలోకి దిగింది. బ్యాంకులకు రూ.పది వేల కోట్లను ఎగ్గొట్టడంపై సీబీఐ, రూ.3,822 కోట్లను దారి మళ్లించడంపై ఈడీ ఇప్పటికే ట్రాన్స్ట్రాయ్పై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ట్రాన్స్ట్రాయ్ ముసుగులో స్వాహా ► పోలవరం హెడ్ వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జేవీలో విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ వాటా 87 శాతం. అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. ► చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాయపాటి భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. ► కానీ.. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను శరవేగంగా పూర్తి చేయడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సూచించింది. ► పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపడితే కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా మోకాలడ్డారు. ► ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి స్వాహాకు తెరతీశారు. కమీషన్ల కోసం కేబినెట్ తీర్మానం తుంగంలోకి.. ► ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సబ్ కాంట్రాక్టు కింద పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని 2015 అక్టోబర్ 10న కేబినెట్లో అప్పటి సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు. ► ఆ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ట్రాన్స్ట్రాయ్ – సబ్ కాంట్రాక్టు సంస్థలు, పోలవరం ఎస్ఈల పేరు మీదుగా ఎస్క్రో ఖాతాను తెరిచారు. ఆ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని చూపి.. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.300 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇప్పించారు. ► కానీ.. ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లను చెల్లిస్తే.. ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. మిగతా రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించారు. ► ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లిస్తే రుణం కింద బ్యాంక్ ఆఫ్ బరోడా మినహాయించుకుంటుందని.. కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద దాన్ని తుంగలో తొక్కి నేరుగా బిల్లులు చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ► రూ.422 కోట్లతో డయా ఫ్రమ్ వాల్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది) పనులను చేయడానికి బావర్ – ఎల్ అండ్ టీ సంస్థ.. రూ.125.91 కోట్లతో జెట్ గ్రౌటింగ్ (కాఫర్ డ్యామ్‌ల పునాది) పనులు చేయడానికి కెల్లర్ సంస్థలు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డయా ఫ్రమ్ వాల్ పనులకు మాత్రమే ఎస్క్రో ఖాతా ద్వారా రూ.95 కోట్లను సర్కార్ చెల్లించింది. మరో రూ.237.09 కోట్ల బిల్లులు నేరుగా చెల్లించారు. ► 2018 నాటికే పనులు పూర్తయినా రూ.89.91 కోట్ల బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ చెల్లించలేదు. జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్ సంస్థకు రూ.44 కోట్లు బకాయిపడ్డారు. 2018 నుంచి 2019 మే వరకు చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహించిన వర్చువల్ రివ్యూల్లో ట్రాన్స్ట్రాయ్ నుంచి ఆ బిల్లులు ఇప్పించాలని ఆ రెండు సంస్థల ప్రతినిధులు కోరినా ఫలితం లేకపోయింది. -
పేట..ది పొలిటికల్ సెంటర్
సాక్షి, గుంటూరు :జిల్లాలో ప్రముఖ విద్యాకేంద్రంగా, చైతన్యవంతమైన రాజకీయాలకు పేరు పొందిన నరసరావుపేట దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాకలు తీరిన రాజకీయ యోధులకు నరసరావుపేట పెట్టింది పేరు. ఇక్కడి నుంచి పోటీచేసి గెలిస్తే మంచి పదవులు వస్తాయన్న పేరుంది. నియోజకవర్గం ప్రత్యేకతలు... వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పొగాకుతో పాటు వరి, కంది పంటలను ఎక్కువగా పండిస్తారు. రెడ్డి, కమ్మ, బీసీ, ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. రైతులు, రైతుకూలీలు, వ్యాపారవర్గాలు, ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే.. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా గెలుపొందిన కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, రోశయ్యలు సీఎంలుగా పనిచేశారు. పునర్విభజనకు ముందు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్లతోపాటు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండేవి. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. 2009కి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో కంభం, దర్శి, మార్కాపురంలను తొలగించి గుం టూరు జిల్లాలోని చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను ఈ పార్లమెంట్లో కలిపారు. తొలి ఎంపీ సీఆర్ చౌదరి, ప్రస్తుత ఎంపీ రాయపాటి సాంబశివరావు స్వతంత్రుడే మొట్టమొదటి ఎంపీ ‘పేట’ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొట్టమొదటి ఎంపీగా 1952లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సీఆర్ చౌదరి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున మద్ది సుదర్శనం, కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డిలను రెండుసార్లు చొప్పున ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. 1952 నుంచి 2014 వరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 9 సార్లు గెలిస్తే, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. 1998లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 1999లో మరో మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దనరెడ్డి, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వరుసగా కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1984లో టీడీపీ ఆవిర్భావంతో అప్పటి రాజకీయ ఉద్ధండులు కాసు బ్రహ్మానందరెడ్డిపై టీడీపీ తరఫున కాటూరి నారాయణస్వామి గెలుపొందగా, 1996లో కాసు వెంకటకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యరి సైదయ్య గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బాలశౌరిపై టీడీపీ అభ్యర్థి వేణుగోపాలరెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2014లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాయపాటి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి... టీడీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మళ్లీ పోటీ చేయనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు బరిలో నిలిచారు. రాయపాటి ఎంపీగా ఉన్న ఐదేళ్లూ నియోజకవర్గానికి దూరంగా ఉండటం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్‌తోపాటు ఆయన కుమార్తె, కుమారుడు నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు, భూకబ్జాలు పార్టీ కొంప ముంచుతాయేమోననే భయం ఆ పార్టీశ్రేణుల్లో ఉంది. చక్రం తిప్పనున్న శ్రీకృష్ణుడు... విలక్షణమైన తీర్పు నివ్వడంలో నరసరావుపేట ఓటర్లు ఎప్పుడూ ముందుంటారు. వైఎస్సార్సీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఆయన కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రచారం ఉధృతం చేశారు. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదకూరపాడు, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీ సంఖ్యలో శ్రీకృష్ణ దేవరాయలు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమాధిరాళ్లు... గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వరికపూడిశెల గ్రామం వద్ద 1998లో అప్పటి సీఎం చంద్రబాబు వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పథకం ద్వారా మొదటి దశలో 5వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. మలి విడతలో మొత్తం 45వేల ఎకరాలకు సాగునీరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 5 మండలాల పరిధిలోని 38 గ్రామాలకు తాగునీరు అందించేలా అధికారులు పథకానికి రూపకల్పన చేశారు. అయితే 1998 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ పునాది రాయిని సమాధిరాయిగా మార్చారు. ఎన్నిసార్లు అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదు. దీంతో 2004 ఎన్నికల్లో మాచర్ల ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీతో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చొరవతో 2008 జూన్ 6న దివంగత మహానేత వైఎస్సార్ తిరిగి ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. అయితే మహానేత అకాల మరణంతో పథకం ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తి చేయిస్తారంటూ అక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో ఆ నియోజకవర్గ ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. దుర్గి మిర్చియార్డును పూర్తి చేస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ హయాంలో అభివృద్ధి ఆనవాళ్లు - నరసరావుపేటలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు 2008లో అప్పటి సీఎం వైఎస్సార్ పరిష్కారం చూపారు. రూ.44కోట్ల వ్యయంతో నరసరావుపేట పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. - గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి చలించిన వైఎస్సార్ గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్లకు మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేశారు. గురజాల్లో సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని గురజాల ప్రజలకు అందించి వారి దాహార్తిని తీర్చారు. - సత్తెనపల్లిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగుచేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు, ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి రెండుపూటలా మంచినీరు అందించారు. - వినుకొండ నియోజకవర్గంలో రూ.30 కోట్ల వ్యయంతో సిమెంట్‌రోడ్లు, సైడుకాల్వలు, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వంటి పనులను పూర్తిచేయించారు. తద్వారా పట్టణంలో మౌలికవసతులు కల్పించి ప్రజల మన్ననలు పొందారు. - చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ అండ్ సొసైటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రూ.16.74 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించి పట్టణంలోని మురికివాడల్లో మౌలికవసతులు కల్పించారు. రాయపాటికి తలపోటు 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటికీ నర్సరావుపేట కేంద్రంగా సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఐదేళ్లపాటు రాయపాటి ఉన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులపై సొంతపార్టీ నేతలే అసమ్మతితో ఊగిపోతుండటం రాయపాటికి నిద్రపట్టకుండా చేస్తోంది. ఇలా అన్ని చోట్లా టీడీపీకి సహకరించబోమంటూ అభ్యర్థులను వ్యతిరేకించే నాయకులు వ్యాఖ్యానిస్తుండటంతో రాయపాటి తలపట్టుకుని కూర్చున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో మొత్తం ఓటర్లు 1601271 పురుష ఓటర్లు 7,90,062 మహిళా ఓటర్లు 8,11,019 ఇతరులు 190 – నక్కా మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
మహానాడుకు రాయపాటి, రామసుబ్బారెడ్డి డుమ్మా
అధినేత తీరుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌దీ అదే బాట హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేత ఎస్వీ రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఎస్వీ సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి తనకు ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ రాయపాటి అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మహానాడు వేదికగా టీడీపీలోని పలు లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు కుటుంబం ఈ మహానాడుకు దూరంగా ఉంది. నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ, బాలకృష్ణ, యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు రాయపాటి, ఎస్వీ రామసుబ్బారెడ్డి కూడా మహానాడుకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.