ట్రాన్స్‌ట్రాయ్‌పై డీఆర్‌‘ఐ’ | DRI Focus On Rayapati Sambasiva Rao Company TransTroy Financial Irregularities | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ట్రాయ్‌పై డీఆర్‌‘ఐ’

Published Mon, Dec 21 2020 4:58 AM | Last Updated on Mon, Dec 21 2020 4:58 AM

DRI Focus On Rayapati Sambasiva Rao Company TransTroy Financial Irregularities - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ఆర్థిక అక్రమాలపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం)లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది (డయా ఫ్రమ్‌ వాల్‌) పనులు చేసిన బావర్‌కు.. కాఫర్‌ డ్యామ్‌ల పునాది (జెట్‌ గ్రౌటింగ్‌) పనులు చేసిన కెల్లర్‌ సంస్థకు బిల్లుల చెల్లింపులో ట్రాన్స్‌ట్రాయ్‌ నిబంధనలను అతిక్రమించడంపై ప్రధానంగా దర్యాప్తునకు సిద్ధమైంది. తమ దేశ సంస్థలకు ట్రాన్స్‌ట్రాయ్‌ ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించేలా చూడాలని డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌)కు, పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)కి జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ వద్ద ఆ రెండు సంస్థలు సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని.. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్‌ట్రాయ్‌ బకాయి పడిందని, వాటితో తమకు సంబంధం లేదని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. పీఎంవోకూ ఇదే అంశాన్ని నివేదించింది. దీంతో 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆదేశించడంతో డీఆర్‌ఐ రంగంలోకి దిగింది. బ్యాంకులకు రూ.పది వేల కోట్లను ఎగ్గొట్టడంపై సీబీఐ, రూ.3,822 కోట్లను దారి మళ్లించడంపై ఈడీ ఇప్పటికే ట్రాన్స్‌ట్రాయ్‌పై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.  

ట్రాన్స్‌ట్రాయ్‌ ముసుగులో స్వాహా 
► పోలవరం హెడ్‌ వర్క్స్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్‌సీ–యూఈఎస్‌ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జేవీలో విదేశీ సంస్థలైన జేఎస్‌సీ, యూఈఎస్‌ వాటా 87 శాతం. అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ వాటా కేవలం 13 శాతమే. 
► చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి రాయపాటి భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 
► కానీ.. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను శరవేగంగా పూర్తి చేయడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సూచించింది. 
► పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపడితే కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా మోకాలడ్డారు. 
► ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి స్వాహాకు తెరతీశారు.  

కమీషన్ల కోసం కేబినెట్‌ తీర్మానం తుంగంలోకి..  
► ట్రాన్స్‌ట్రాయ్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని 2015 అక్టోబర్‌ 10న కేబినెట్‌లో అప్పటి సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు.  
► ఆ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ట్రాన్స్‌ట్రాయ్‌ – సబ్‌ కాంట్రాక్టు సంస్థలు, పోలవరం ఎస్‌ఈల పేరు మీదుగా ఎస్క్రో ఖాతాను తెరిచారు. ఆ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని చూపి.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ద్వారా రూ.300 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇప్పించారు. 
► కానీ.. ట్రాన్స్‌ట్రాయ్‌ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లను చెల్లిస్తే.. ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్‌ ద్వారా చెల్లించారు. మిగతా రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించారు. 
► ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లిస్తే రుణం కింద బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మినహాయించుకుంటుందని.. కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద దాన్ని తుంగలో తొక్కి నేరుగా బిల్లులు చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు.  
► రూ.422 కోట్లతో డయా ఫ్రమ్‌ వాల్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది) పనులను చేయడానికి బావర్‌ – ఎల్‌ అండ్‌ టీ సంస్థ.. రూ.125.91 కోట్లతో జెట్‌ గ్రౌటింగ్‌ (కాఫర్‌ డ్యామ్‌ల పునాది) పనులు చేయడానికి కెల్లర్‌ సంస్థలు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డయా ఫ్రమ్‌ వాల్‌ పనులకు మాత్రమే ఎస్క్రో ఖాతా ద్వారా రూ.95 కోట్లను సర్కార్‌ చెల్లించింది. మరో రూ.237.09 కోట్ల బిల్లులు నేరుగా చెల్లించారు.  
► 2018 నాటికే పనులు పూర్తయినా రూ.89.91 కోట్ల బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించలేదు. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేసిన కెల్లర్‌ సంస్థకు రూ.44 కోట్లు బకాయిపడ్డారు. 2018 నుంచి 2019 మే వరకు చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహించిన వర్చువల్‌ రివ్యూల్లో ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి ఆ బిల్లులు ఇప్పించాలని   ఆ రెండు సంస్థల ప్రతినిధులు కోరినా ఫలితం లేకపోయింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement