‘ఎస్క్రో’ నుంచి ఎస్కేప్‌.. అడ్డదారిలో బిల్లులు | CBI focus on violations of regulations in TransTroy loans | Sakshi
Sakshi News home page

‘ఎస్క్రో’ నుంచి ఎస్కేప్‌.. అడ్డదారిలో బిల్లులు

Published Thu, Jan 2 2020 4:08 AM | Last Updated on Thu, Jan 2 2020 4:08 AM

CBI focus on violations of regulations in TransTroy loans - Sakshi

ఎస్క్రో అకౌంట్‌ అంటే..
ప్రభుత్వం తరఫు అధికారి, ప్రధాన కాంట్రాక్టర్, సబ్‌ కాంట్రాక్టర్లతో కూడిన జాయింట్‌ అకౌంట్‌నే ఎస్క్రో అకౌంట్‌ అంటారు. అన్నీ సక్రమంగా ఉంటేనే వీరందరి సంతకాలకు అవకాశం ఉంటుంది. అప్పుడే డబ్బు డ్రా చేసుకోవాలి. ఆ సమయంలో బ్యాంకుల అప్పు మినహాయించుకునే వీలుంటుంది.     

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నిబంధనలనే కాదు.. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా బిల్లులు చెల్లించేలా అప్పటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పడాన్ని 14 బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీని వల్ల ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి రుణాలు వసూలు చేయకుండా చంద్రబాబు పరోక్షంగా అడ్డుకున్నట్లయ్యిందని బ్యాంకుల కన్సార్షియం వాపోతోంది. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని, కానీ ఆ మేరకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పును వసూలు చేయలేకపోయామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నతాధికారులు సీబీఐకి వివరించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించడంతో ఎస్క్రో అకౌంట్‌ గుట్టు విప్పడంపై సీబీఐ దృష్టి సారించింది. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌ను ముందుపెట్టి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి.. తద్వారా లబ్ధిపొందాలని 2015లో అప్పటి ప్రభుత్వ పెద్ద స్కెచ్‌ వేశారు. కానీ.. ట్రాన్స్‌ట్రాయ్‌ వ్యవహార శైలిపై నమ్మకం కుదరని సబ్‌ కాంట్రాక్టర్లెవరూ పనులు చేయడానికి ముందుకు రాలేదు. 2015 అక్టోబర్‌ 10న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్, సబ్‌ కాంట్రాక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారి పేరుతో సంయుక్తంగా ‘ఎస్క్రో అకౌంట్‌’ తెరుస్తామని.. ఆ అకౌంట్‌ ద్వారానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తామని తీర్మానం చేయించారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం మేరకు హైదరాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను తెరిపించారు.

సర్కారు హామీతో రూ.300 కోట్ల రుణం 
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో చేసిన పనులకు ఎస్క్రో అకౌంట్‌ ద్వారానే బిల్లులు చెల్లిస్తామని.. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇవ్వాలని అప్పటి సీఎంవోలోని కీలక అధికారి ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నతాధికారులతో నాటి ప్రభుత్వ పెద్ద రాయబారాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే తాము ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు వాపోతున్నారు. హెడ్‌ వర్క్స్‌ నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ని 60సీ నిబంధన కింద పూర్తిగా తప్పించే వరకు.. అంటే 2018 జనవరి వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్‌ ద్వారా, మిగతా మొత్తం రూ.2,267.22 కోట్లను (ఆడిటింగ్‌లో రూ.5.64 కోట్లు తగ్గింది) నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కే చెల్లించారు. 

కమీషన్ల కోసం కేబినెట్‌ తీర్మానం తుంగలోకి.. 
ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్షియంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఒకటి. ఆ ఖాతా ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లిస్తే.. వాటిని అప్పుల కింద కన్షార్షియం మినహాయించుకుంటుంది. దీంతో కమీషన్లు వసూలు చేసుకోవడం కష్టమవుతుందని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద.. మంత్రివర్గంలో ఆమోదించిన తీర్మానాన్ని తుంగలో తొక్కి, ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించేలా చక్రం తిప్పారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమన్న ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చారు. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో పనులు జరగాలంటే ట్రాన్స్‌ట్రాయ్‌కి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని.. సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే వారు పనులు చేయరని.. దాని వల్లే ఇతర బ్యాంకుల నుంచి బిల్లులు చెల్లించాలని అప్పట్లో తన నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించుకున్నారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐ దృష్టి 
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన కన్సార్షియంలోని బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలి. కానీ, ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.2,261.58 కోట్ల విలువైన లావాదేవీలు ఇతర బ్యాంకుల నుంచి జరిపినట్లుగా ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో వెల్లడైన అంశాన్ని ఆధారాలతో బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. ఎస్క్రో అకౌంట్‌ నిబంధనను కూడా తుంగలో తొక్కి.. ఆర్బీఐ నిబంధనలను తోసిపుచ్చి ప్రభుత్వం చెల్లింపులు చేసిందని స్పష్టం చేసింది. బ్యాంకుల కన్సార్షియం కన్నుగప్పి.. ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించడంలో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందన్న ఫిర్యాదుపై  సీబీఐ దృష్టి సారించి.. గుట్టువిప్పేందుకు కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement