
స్వాధీనం చేసుకున్న నగదు, ఓటరు జాబితాలు, స్లిప్పులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి నారాయణ విద్యాసంస్థల సిబ్బంది డబ్బు ప్రవాహం పారిస్తూ రెండోసారి పట్టుబడ్డారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా ఇచ్చి వారితో మాట్లాడి నేరుగా ఓటరుకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆదివారం నెల్లూరులోని 43వ డివిజన్‌లోని టీడీపీ ఎన్నికల ప్రచార కార్యాలయంలో రూ.8.30 లక్షల నగదుతో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం 40వ డివిజన్ మూలాపేటలో నారాయణ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుని ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారి రాజేంద్రకుమార్‌సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని అధ్యాపకుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను తనిఖీ చేయగా రూ.50 వేల నగదు, ఓటరు స్లిప్పులు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకుని అధ్యాపకుడితోపాటు నారాయణలో పనిచేస్తున్న మరో ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తరలించి బాలమురళీకృష్ణపై కేసు నమోదు చేశారు.
స్టేషన్‌లో టీడీపీ నేత పట్టాభి వీరంగం
టీడీపీ నేత, మంత్రి నారాయణ ముఖ్యఅనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితోపాటు పలువురు నేతలు పోలీసుస్టేషన్‌కు చేరుకుని వీరంగం సృష్టించారు. తమ సిబ్బందిని అనవసరంగా ఎందుకు తీసుకొచ్చారు? కావాలనే చేస్తున్నారా? అంటూ పోలీసు సిబ్బందితో గొడవకు దిగారు. తాము సూచించిన వారిపై చర్యలు తీసుకోకపోతే మీ ఇష్టం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.50 వేలు తాము వెంట తీసుకెళతామని.. పట్టుకునే దమ్ముందా? అంటూ పలువురు టీడీపీ నేతలు పోలీసులకు, ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సవాల్ విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వరుసగా నగదు పంపిణీ చేస్తూ తమ వారు పట్టుబడుతుండడంతో పట్టాభిరామిరెడ్డి సహనం కోల్పోయారు. నగదుతో పట్టుబడిన తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని పట్టాభిరామిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. తమ వారిని అకారణంగా తీసుకువచ్చారని, వెంటనే విడిచిపెట్టాలని డీఎస్పీ మురళీకృష్ణపైఒత్తిడి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment