
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణపై మోదీకి ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికీ కేసీఆర్‌కు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణపై ఇంతగా విషం చిమ్ముతున్నా టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు బీజేపీకి పార్లమెంటులో మద్దతుగా వ్యవహరించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణకు ప్రత్యేకహోదా కావాలని హైదరాబాద్‌లో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ నేతలు, లోక్‌సభలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నయీం కేసుపై కేసీఆర్, విశాఖ భూములపై ఏపీ సీఎం చంద్రబాబు సిట్‌లు వేసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నదని నారాయణ అన్నారు. మోదీ ముకేశ్ అంబానీతో వ్యవహరిస్తున్న తీరు ప్రధానమంత్రి హోదాను దిగజారుస్తున్నాయని నారాయణ చెప్పారు. కార్పొరేట్లతో బహిరంగంగా సమావేశం అవుతానని మోదీ చెప్పడం సరికాదన్నారు.
హైదరాబాద్‌లో మెట్రోరైలు ఓల్డ్‌సిటీకి ఎందుకు వెళ్లడంలేదని అడిగారు. మెట్రో ఆపడానికి కొన్ని సంస్థలు విదేశీసంస్థల నిధులు తీసుకుంటున్నాయని మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి ఆరోపించడం తీవ్రంగా పరిగణించాలని నారాయణ కోరారు. జాతీయ బాధ్యతల నిర్వహణకోసం తాను ఢిల్లీకి కుటుంబంతో సహా మారుతున్నట్టుగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment