ఏపీలో అవినీతి,కుటుంబ పాలన | Narendra Modi Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీలో అవినీతి,కుటుంబ పాలన

Published Sat, Mar 2 2019 3:53 AM | Last Updated on Sat, Mar 2 2019 8:32 AM

Narendra Modi Fires On Chandrababu  - Sakshi

విశాఖ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు

(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ప్రతి విషయంలోనూ యూటర్న్‌లు తీసుకునే వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎలా పాటు పడతారో రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా సీఎం చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏ నేతా, ఏ వ్యక్తి తీసుకోనన్ని యూటర్న్‌లు తీసుకున్న వ్యక్తి తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే మోదీని తిట్టడానికే తన సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం విశాఖపట్నం రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించిన ‘ప్రజా చైతన్యసభ– సత్యమేవ జయతే’ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని హిందీలో చేసిన ప్రసంగాన్ని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.

రాత్రి ఏడున్నరకు మోదీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సభికులతో మూడుసార్లు భారతమాతకు జై అని నినాదాలు చేయించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పి యువత ఉపాధి కోసం పాటు పడుతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు మాత్రం వారి పిల్లల అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని మోదీ విమర్శించారు. ‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకు లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికీ తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు’ అని దుయ్యబట్టారు. ‘నిత్యం అసత్యాలు చెబుతున్న వారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పులను మనపైకి నెడుతున్నారు. వారి బండారాన్ని మనమంతా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.



ఆయన ఎలాంటి వారితో జతకట్టారో తెలుసా..?
టీడీపీ–కాంగ్రెస్‌ స్నేహంపై మోదీ మాట్లాడుతూ æయూటర్న్‌ తీసుకున్న ఈ నాయకుడు ఎలాంటి వారితో జతకట్టారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో పాటు రాష్ట్ర ప్రజల ఉనికిని సైతం దెబ్బతీసేలా వ్యవహరించిన వారితో జతకట్టారంటూ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి తావు లేకుండా పేదలు, బలహీన వర్గాల కోసం పనిచేస్తుంటే కూటమి కట్టిన నాయకులు తమ ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలంతా కూటమి నేతల కుటిల నీతిని గుర్తించారని చెప్పారు.

పాక్‌కు గుణపాఠం చెబితే మోదీ హఠావో అంటారా?
ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌ని వేలెత్తి చూపుతున్న తరుణంలో దేశంలోని కొందరు నాయకులు మాత్రం శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని మోదీ ఆరోపించారు. అలాంటి నేతలు మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాయకులు మాట్లాడే మాటలను ఆ దేశంలోని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి ఏమిటో ప్రజలే గమనించాలని సూచించారు. అలా మాట్లాడుతున్న వారిని ప్రజలే ప్రశ్నించాలని కోరారు. వీరంతా దేశాన్ని ఎలా కించపరుస్తున్నారో ఆలోచించాలన్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారని ధ్వజమెత్తారు. మోదీని విరోధిగా చిత్రీకరించాలని చూస్తూ దేశాన్ని అస్థిరçపరిచే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్‌కు గుణపాఠం చెబుతున్న తరుణంలో మోదీ హఠావో అనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

మళ్లీ అధికారమిస్తే మెరుగైన పాలన...
దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే వీర జవానైనా, రైతులైనా సురక్షితంగా ఉంటారని ప్రధాని పేర్కొన్నారు. రైతుల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న, సన్నకారు రైతు ఖాతాలో నాలుగు నెలల కొకసారి రూ.రెండు వేల చొప్పున జమ చేస్తామన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇస్తే «ఇంతకంటే ధృడమైన, మెరుగైన పాలన అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 

ప్యాకేజీకి ఒప్పుకోలేదని కాణిపాకం వినాయకుడిపై ఒట్టేస్తారా?
– సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్‌
ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి ఒప్పుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కాణిపాకం వినాయకుడిపై ఒట్టేసి చెప్పగలరా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సవాల్‌ విసిరారు. విశాఖలో ప్రధాని పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా చేసిన అవినీతిపై మోదీ ఎక్కడ చర్యలు చేపడతారోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ భయంతోనే ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మానసిక వ్యాధితో ఉన్నవారు ముఖ్యమంత్రిగా ఉండడానికి  అనర్హులన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయడంపై ఎంపీ హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement