సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా 5 స్థానాలకు గానూ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడింట విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సికందరా ప్రజలు మరోసారి బీజేపీకి మద్ధతు తెలిపడం ఆనందదాయకమంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కారణంగానే ఇక్కడ తమ పార్టీ విజయం సాధించిందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కేసాంగ్, లికాబలి ప్రజలు బీజేపీపై నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారు. ఈశాన్య రాష్టాల పురోగతికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని మోదీ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లోని సబాంగ్‌లో పార్టీ ఓటమి పాలైనా, గతంలో కంటే బీజేపీకి అధికంగా ఓటు శాతం నమోదుకావడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు.
ఉప ఎన్నికల్లో విజేతలు వీరే..
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ తరఫున పక్కే కేసాంగ్ నుంచి బీఆర్ వాగే, లికాబలి నుంచి కర్డో నైగోర్ విజయం సాధించగా, యూపీలోని సికందరా నుంచి అజిత్ పాల్ సింగ్ విజయ కేతనం ఎగురవేశారు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్తి టీటీవీ దినకరన్ 40వే పైచిలుకు ఓట్ల మెజార్టీతో నెగ్గారు. పశ్చిమ బెంగాల్‌లోని సబాంగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గీతా భునియా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment