న్యూఢిల్లీ: మరో మూణ్నెళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ అధికార ఎన్డీయే కూటమికి చేదువార్త. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయనీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ కూటమి 99 సీట్లు కోల్పోనుందని తేలింది. అటు యూపీఏ కూటమి కూడా ఎన్డీయే కన్నా తక్కువ సీట్లే గెలుస్తుందనీ, అయితే గతంతో పోలిస్తే ఈ కూటమికి 106 సీట్లు అధికంగా, 166 సీట్లు వస్తాయని సర్వే అంటోంది. రెండు కూటముల్లో దేనికీ సాధారణ ఆధిక్యం (272 సీట్లు) రాదు కాబట్టి పార్లమెంటులో హంగ్ తప్పదని ఎంవోటీఎన్ సర్వే జోస్యం చెబుతోంది.
పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 202 స్థానాలు, కాంగ్రెస్‌కు 96 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్డీయే, యూపీఏల్లో ఏ కూటమిలోనూ లేని ఇతర పార్టీలకు మాత్రం దాదాపు గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లే ఇప్పుడూ వచ్చే అవకాశముందంది. ఆ పార్టీలన్నీ కలిపి 140 సీట్ల వరకు గెలుస్తాయనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీటి మద్దతు తప్పనిసరని సర్వే పేర్కొంది. అంటే దాదాపు 100 సీట్లు ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి చేజారి యూపీఏ ఖాతాలో చేరనున్నాయి. ప్రస్తుతం ఇరు కూటముల్లోనూ లేని ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి, తృణమూల్, పీడీపీలు యూపీఏలో చేరితే ఆ కూటమికి అధికారం వస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలవగా, ఎన్డీయే కూటమికి కలిపి 336 సీట్లు వచ్చాయి.
ఎన్డీయేకు తగ్గనున్న ఓట్ల శాతం
సీట్లతోపాటు ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం కూడా తగ్గనుందని ఎంవోటీఎన్ సర్వే అంటోంది. ఎన్డీయేకు 35 శాతం, యూపీయేకు 33 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో బీజేపీకి కాస్త ఉపశమనం కలిగించే అంశమేదైనా ఉందంటే.. యూపీఏ కన్నా ఆ కూటమికి ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తుండటమే. ఈ అంచనాలన్నీ ఎన్డీయే, యూపీఏల్లో ప్రస్తుతం ఉన్న పార్టీల ఆధారంగా లెక్కించినవే. ఎన్నికల ముందు కూటముల్లో మార్పులు జరిగితే తామ అంచనాలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉందని సర్వే స్పష్టం చేసింది.
ఏ కూటమిలో ఏ పార్టీలు..
ఎన్డీయే: బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఆలిండియా రంగస్వామి కాంగ్రెస్, అప్నాదళ్, బోడో పీపుల్స్ ఫ్రంట్, జేడీ(యూ), ఎల్జేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆర్‌పీఐ(ఏ), శిరోమణి అకాలీ దళ్, సిక్కిం
డెమోక్రటిక్ పార్టీ
యూపీఏ: కాంగ్రెస్, డీఎంకే, జేడీ(ఎస్), కేరళ కాంగ్రెస్ (మణి), ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం.
ఇతరులు: వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, శివసేన, టీడీపీ, ఏఐఎంఐఎం, అన్నాడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), ఆప్, ఏజీపీ, ఫార్వర్డ్ బ్లాక్, తృణమూల్, బీజేడీ, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, ఐఎన్‌ఎల్డీ, పీడీపీ, ఎంఎన్‌ఎస్, ఎన్‌ఎల్పీ, ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి.
సర్వే జరిగిందిలా..
‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఏపీ, తెలంగాణ, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, యూపీ సహా 19 రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 97 లోక్‌సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది.ఓ ప్రశ్నావళిని రూపొందించి దాని ఆధారంగా ప్రజలను ర్యాండమ్‌గా ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో 69 శాతం గ్రామీణ, 31 శాతం పట్టణ వాసులు పాల్గొన్నారు. ఈ సర్వేతో పాటు యూపీలోని 20 లోక్‌సభ స్థానాల్లో 1,103 ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రశ్నావళిని స్థానిక భాషల్లోకి అనువాదంచేసి అందించారు. ఈ సర్వేను 2018, డిసెంబర్ 28 నుంచి 2019, జనవరి 8 మధ్యకాలంలో నిర్వహించారు. ఈ సర్వేలో 19 రాష్ట్రాలకు చెందిన 13,179 మంది పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రెండు ప్రముఖ ఆంగ్ల వార్త చానెళ్లు ఎన్నికల ఫలితాలపై అంచనాలను వెలువరించాయి. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో కార్వీతో కలిసి ఇండియా టుడే టీవీ, ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ.. దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాధించే సీట్ల సంఖ్యలో స్వల్ప తేడాలున్నా.. రెండు సంస్థలు రానున్నది హంగేనని తేల్చాయి. ఎన్డీయే 2014 కన్నా 99 సీట్లు కోల్పోయి 237 స్థానాలు గెలుచుకుంటుందని ఇండియాటుడే.. 103 స్థానాలు కోల్పోయి 233 సీట్లను గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ తేల్చాయి. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గతం కన్నా 106 సీట్లు పెంచుకుని 166 వద్ద నిలుస్తుందని ఇండియాటుడే.. 60 నుంచి 167 స్థానాలకు దూసుకుపోతుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేశాయి. రెండు సంస్థలు కూడా రెండు కూటములకు చెందని ఇతర పార్టీలే కీలకమని తేల్చిచెబుతున్నాయి.
రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీలు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 16 టీఆర్‌ఎస్, 1 ఏఐఎంఐఎం గెలుచుకోనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 19 సీట్లలో, టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.
ఎన్డీయేకు మైనస్.. యూపీయేకు ప్లస్
కోల్‌కతాలో తృణమూల్ నేతృత్వంలో విపక్షాల మెగా ర్యాలీ, యూపీలో కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ–బీఎస్పీ కూటమి ఏర్పాటు, క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనం తదితరాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనావేస్తూ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ ఉమ్మడిగా జరిపిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. పలు మిత్ర పక్షాలు దూరం కావడంతో గతంతో పోలిస్తే ఎన్డీయేకు ఈసారి 103 స్థానాలు తగ్గే అవకాశాలున్నాయి. ఒక్క యూపీలోనే ఎస్పీ–బీఎస్పీ దెబ్బకు 45 సీట్లు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన విపక్షం కాంగ్రెస్ గొప్పగా పుంజుకుని 160కి పైగా సీట్లు దక్కించుకోవచ్చు. హంగ్ ఏర్పడే నేపథ్యంలో 140 సీట్లు కైవసం చేసుకునే ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల పార్టీలు టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీలు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లే.
దక్షిణాదిలోనే యూపీయే
మిగతా అన్ని చోట్లా ఎన్డీయేకే ఆధిక్యం
ఎంవోటీఎన్ సర్వే ప్రాంతాలవారీ ఫలితాలను చూస్తే ఒక్క దక్షిణాదిలో తప్ప ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికే అధిక ఓట్లు, సీట్లు వస్తున్నాయి.
ఉత్తర భారతం: ఈ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, హరియాణ, ఢిల్లీ, పంజాబ్‌లలో ఎంవోటీఎన్ సర్వే జరిగింది. ఇక్కడ ఎన్డీయేకు 40% ఓట్లు, 66 సీట్లు వస్తాయనీ, అటు యూపీఏకు కేవలం 23% ఓట్లు, 20 సీట్లు సర్వే తెలిపింది. ఇక ఇతర పార్టీలకు 37% ఓట్లు, 65 సీట్లు వస్తాయంది. యూపీఏ కన్నా ఇతర పార్టీలకే ఇక్కడ అధిక సీట్లు రానున్నాయి.
పశ్చిమ భారతం: గుజరాత్, మహారాష్ట్రలతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను కూడా ఈ సర్వే పశ్చిమ ప్రాంతంగా పేర్కొంది. ఇక్కడ ఇతరుల పాత్ర పెద్దగా ఉందనీ, యూపీఏ కన్నా ఎన్డీయేకు ఓట్ల శాతం కొంచెం ఎక్కువగా ఉంటున్నప్పటికీ సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఎన్డీయేకు 46% ఓట్లు, 76 సీట్లు, యూపీఏకు 42% ఓట్లు, 40 సీట్లు, ఇతరులకు 12 శాతం ఓట్లు తప్ప సీట్లేవీ రావని సర్వే అంటోంది.
తూర్పు భారతం: బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్‌ల్లో సర్వే జరిగింది. ఇక్కడా ఎన్డీయేదే పై చేయి. ఎన్డీయే కూటమికి 37% ఓట్లు, 69 సీట్లు, యూపీఏకు 25% ఓట్లు, 28 సీట్లు, ఇతర పార్టీలకు 38% ఓట్లు, 45 సీట్లు వస్తాయని ఎంవోటీఎన్ సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు బలపడినట్లుగా సర్వే తెలిపింది.
దక్షిణ భారతం: యూపీఏకు ఆధిక్యం ఉన్న ప్రాంతం ఇదొక్కటే. అదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీ 18 శాతం ఓట్లతో 26 సీట్లు సాధిస్తుందనీ, ఇతర పార్టీలు 39 శాతం ఓట్లు తెచ్చుకుని 30 సీట్లు గెలుస్తాయని సర్వే తెలిపింది. యూపీఏకు 43 శాతం ఓట్లు, 78 సీట్లు వస్తాయంది.
Comments
Please login to add a commentAdd a comment