మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో! | Narendra Modi meditated Cave Specialties | Sakshi
Sakshi News home page

మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!

Published Tue, May 21 2019 1:58 PM | Last Updated on Tue, May 21 2019 7:03 PM

Narendra Modi meditated Cave Specialties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్‌ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడికి సమీపంలోని ఓ గుహను సందర్శించి అక్కడ కాసేపు ధ్యానం చేసిన విషయం తెల్సిందే. ఆ గుహకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ గుహను ‘ఆధునిక ధ్యాన గుహ’ లేదా ‘రుద్ర గుహ’ అని పిలుస్తారు. ఆ గుహలో ఇద్దరు కొంచెం కష్టంగా, ఒక్కరు హాయిగా పడుకునేందుకు ఓ మంచం, ఆ మంచం మీద ఓ మెత్తటి పరుపు ఉంటుంది. పగటి పూట ప్రకృతి అందాలను తిలకించేందుకు మంచం పక్కనే ఓ కిటికీ కూడా ఉంది. గుహకు మరోపక్కన స్నానం చేసేందుకు కుళాయితో కూడిన సదుపాయం, మరో దిక్కున టాయిలెట్‌ సౌకర్యం ఉంది. ఆలయానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో, సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఈ గుహ ఉంది.

పొడువు ఐదు మీటర్లు, వెడల్పు మూడు మీటర్లు ఉండే ఈ గుహలో 24 గంటల విద్యుత్‌ సౌకర్యం, చార్జింగ్‌ ప్లగ్గులు ఉన్నాయి. టెలిఫోన్‌ సౌకర్యం ఉంది. స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యంతోపాటు మనిషి సాయం కూడా ఉంది. అక్కడున్న గంట కొట్టగానే 24 గంటలపాటు అందుబాటులో ఉండే అటెండర్‌ వస్తాడు. ఉదయం తేనీరు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్‌ సరఫరా చేస్తారు. విడిచిన చొక్కాలను తగిలించుకునేందుకు నాలుగైదు కొక్కాలు గల హ్యాంగర్‌ (మోదీ ఫొటోలో కుడివైపు కనిపిస్తుంది)కూడా ఉంది. ఎప్పుడు చల్లగా ఉండే ఈ గుహకు ఎయిర్‌ కండీషన్‌ సౌకర్యం మాత్రం లేదు. ‘గార్వల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గుహను గతేడాది కృత్రిమంగా నిర్మించారు. దీనికి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చయిందట, కేదారినాథ్‌ ఆలయానికి వచ్చే భక్తులను ఆకర్షించడానికి ఇక్కడ ఇలాంటి నాలుగైదు గుహలను నిర్మించాలనుకున్నారు.

ఇంతకుముందు ఈ రుద్ర గుహను కనీసంగా మూడు రోజులపాటు బస చేసేలా మూడువేల రూపాయలకు అద్దెకు ఇచ్చేవారు. పర్యాటకులు ఒక్క రోజుకు మించి ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడక పోతుండడంతో ఇటీవల రోజువారి ప్యాకేజీని ప్రవేశపెట్టారు. టీ, టిఫిన్, భోజన సదుపాయాలతో రోజుకు 990 రూపాయలను ఛార్జి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఈ గుహలోనే పడుకొని ఆదివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఆయన మొత్తం ఈ గుహలో 17 గంటలపాటు గడపగా, మీడియా పొరపడి ఆయన ఈ గుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు అని రాసింది. బీజేపీ అధికారికంగా ‘కేదారినాథ్‌లో ధ్యానం చేస్తున్న కర్మయోగి’ అంటూ నాలుగు ఫొటోలతో ట్వీట్‌ చేసింది. ఇదెక్కడ ఆదివారం నాటి పోలింగ్‌ను ప్రభావితం చేస్తుందోనని భయపడిన సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. మోదీ తన వ్యక్తిగత విశ్వాసాలకు మీడియా ప్రచారం కల్పించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారి ఎన్నికల ప్రచారంపై ఒకటి, రెండు రోజులపాటు నిషేధం విధించి చేతులు దులుపుకునే అలవాటున్న మన ఎన్నికల కమిషన్‌కు, ఆఖరి విడత పోలింగ్‌ ముగియడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుతానికి మౌనం వహించింది. దేనికైనా స్పందించే గుణం కలిగిన నెటిజన్లు మాత్రం కృత్రిమ గుహలో మోదీ ధ్యానం చేయడం పట్ల వ్యంగోక్తులు విసురుతున్నారు. వారిలో ఒకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడో జమ్మూలోని వైష్ణవి దేవీ గుహను సందర్శించిన ఫొటోను ట్వీట్‌ చేశారు. నరేంద్ర మోదీకన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జాయ్‌ షా మే 9 నుంచి 11వ తేదీ వరకు ఈ గుహలో బసచేసి వెళ్లారు. ఈ గుహను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మోదీ రాకతో తమ గుహకు మహర్దశ పట్టుకున్నట్లేనని, దీంతో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ‘గార్వల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌’ జనరల్‌ మేనేజర్‌ బీఎల్‌ రానా మీడియాతో వ్యాఖ్యానించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement