
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార తార విజయశాంతి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రక్షించాల్సింది పోయి భయపెడుతున్నారని ఆరోపించారు. రానున్న లోకసభ ఎన్నికలు కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు.
మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్
దమ్ముంటే అరెస్టు చేయ్.. మోదీకి సవాల్!
ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. మోదీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని దేశ ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మోదీని గద్దె దింపాలని విజయశాంతి పిలుపునిచ్చారు. కాగా ఇదే సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. మోదీ, కేసీఆర్ కుమ్మకైయ్యారని విజయశాంతి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment