సమావేశంలో మాట్లాడుతున్న సమన్వయకర్త నవీన్‌నిశ్చల్
అనంతపురం ,హిందూపురం అర్బన్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనువుగా పనిచేస్తున్నా. రేపు కూడా చేస్తా. పార్టీ నాకు టిక్కెట్టు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రెండో ఆలోచనే లేదు. నాకు ఓపిక ఉంది.’ అని ఆ పార్టీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తేల్చి చెప్పారు. హిందూపురంలోని తన స్వగృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే విషయంపై పార్టీ నేతలతో మా స్వగృహంలో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకున్నాం. దీనిపై సోషల్ మీడియా, యూట్యూబ్‌తో పాటు పత్రికల్లో కల్పితాలు జోడించి సత్యదూర ప్రచారం చేశారు.
తాను డబ్బు ఇవ్వకపోవడంతో అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వడం లేదనేది పూర్తి అవాస్తవం. జగన్ డబ్బు ప్రస్తావనే నా వద్ద తీసుకురాలేదు. ఎన్నికలకు అవసరమైన డబ్బు మా సోదరుడు నాకు ఇస్తారని కార్యకర్తలతో చెప్పా. దాన్ని వక్రీకరించారు. కేవలం నలుగురు వ్యక్తులు నాపై దుమ్మెత్తి పోసేందుకు ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు. వారికి నవీన్‌ను దెబ్బతీయాలనే ఆలోచన తప్ప, పార్టీ అభివృద్ధికి పాటుపడాలనే ధ్యాసే లేదు. ఎన్నికలకు అవసరమైన డబ్బు నా వద్ద లేదన్నది అవాస్తవం. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. గెలుపోటములు దైవాధీనం. రాజకీయంగా నాతోపాటు కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కుని జైలుపాలై ఇబ్బందులు పడ్డారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది’ అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ, బి, బ్లాక్ కన్వీనర్లు ఇర్షద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నారాయణస్వామి, లక్ష్మినారాయణ, ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment