చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తనకు అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని.. కాంగ్రెస్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నవజోత్ సింగ్ సిద్ధు తన భార్యకు మద్దతుగా నిలిచారు. సీఎం తన భార్యకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడటమే కాక, అమృత్ సర్ నుంచి పోటీ చేసేందుకు ఆమె నిరాకరించిందని చెప్పడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ‘నా భార్య కౌర్ ధైర్యవంతురాలు.. నైతిక విలువలున్న మనిషి. తను ఎన్నడూ అబద్ధాలు చెప్పదు’ అని వ్యాఖ్యానించారు.
గత ఏడాది దసరా పండుగ నాడు జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అమృత్‌సర్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భావించిన అమరీందర్ సింగ్ తనకు అమృత్‌సర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని నవజోత్ కౌర్ ఆరోపించారు. అంతేకాక సీఎం మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. అమరీందర్ సింగ్ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. కానీ చదువుకుని.. ప్రజలకు సేవ చేయాలని భావించే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వకుండా అబద్ధాలు చెప్తారని నవజోత్ కౌర్ విమర్శించారు.
ఈ విమర్శలపై సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. టికెట్ల కేటాయింపు విషయం తన చేతిలో ఉండదని.. ఢిల్లీ హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక నవజోత్ కౌర్ చండీగఢ్ నుంచి పోటీ చేయాలని భావించారని.. అది పంజాబ్ కిందకు రాదని ఆయన తెలిపారు. అమృత్ సర్ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు కౌర్ సంసిద్ధత వ్యక్తం చేయగా.. అక్కడ సిట్టింగ్ అభ్యర్థి గుర్జిత్ సింగ్‌కు టిక్కెట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment