
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేనలు కీచులాడుకోవడం పట్ల ఎన్సీపీ నేత, శరద్‌పవార్ మనుమడు రోహిత్ రాజేంద్ర పవార్ మండిపడ్డారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల్లో నెలకొన్న తాజా సంవాదం ప్రజాస్వామ్య ప్రక్రియకే ముప్పని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బాలాసాహెబ్ థాకరేను తాను గౌరవిస్తానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన స్పష్టం చేశారు. శివసేన వ్యవస్ధాపక నేత బాల్ ఠాక్రే జీవించి ఉంటే బీజేపీ ఈస్ధాయిలో తెగించేది కాదని చెప్పారు. ఎన్నికలకు ముందు శివసేనతో అధికారం పంచుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విభేదాలను పక్కనపెట్టి ఇరు పార్టీలు రాబోయే ఐదేళ్లు స్ధిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాయా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు, శరద్ పవార్ సమీప బంధువైన రోహిత్ పవార్ ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కజ్రత్ జంఖేడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.