తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం.. ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్కని చూపిస్తూ ఓ సెల్ఫీ దిగడం.. మాకూ ఒక హక్కు వచ్చిందన్న ఆనందం.. దానికి మించినదేముంటుంది? ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం.. ఆ ఉత్సాహమే వేరు.. చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో స్టేటస్‌తో హల్‌చల్ చేస్తోన్న ‘ఈ–తరం’ ఓట్లపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇంతకీ నవతరం నడక ఎటువైపు?
జాతీయతే వారి నినాదం
యువతరం అనగానే ఉద్యోగాలు, స్వేచ్ఛ కోరుకుంటారని భావిస్తారు ఎవరైనా. గత ఎన్నికల్లో మోదీ ఉద్యోగాల హామీకి ఆశపడిన యువతరం.. ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే ఆయనకు ఓట్లు వేసిందన్న అంచనాలున్నాయి. అయితే తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ట్రిబ్యూన్ పత్రిక. ఆ పత్రిక ఉత్తరాది రాష్ట్రాల్లో కాలేజీలన్నీ చుట్టి ఒక సర్వే నిర్వహించింది. అందులో ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వెల్లడయ్యాయి. తొలి ఓటర్లలో అత్యధికులు దేశ భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తామని కుండబద్దలు కొట్టారు. పుల్వామా దాడుల తర్వాత మోదీ సర్కార్ నక్క జిత్తులమారి పాక్‌ను దెబ్బకు దెబ్బ తీసిందని కాలేజీ విద్యార్థులు ముక్తకంఠంతో నినదించారు. 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరీ’ సినిమాను తాము ఎన్నిసార్లు చూశామో లెక్కే లేదన్నారు.
మోదీ దౌత్యానికి ఫిదా
పాక్ సైన్యానికి చిక్కిన ఐఎఎఫ్ అధికారి అభినందన్ విడుదల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యపరమైన చర్యలు చేపట్టిన తీరుకు తాము ఫిదా అయినట్టుగా త్రిపాఠి అనే విద్యార్థి, వారి స్నేహితులు తమ మనోగతాన్ని బయటపెట్టారు. యూపీ, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, హరియానా, కశ్మీర్, పశ్చిమబెంగాల్.. ఇలా ఏ రాష్ట్రంలో కాలేజీకి వెళ్లి అడిగినా అదే సమాధానం వినిపించింది. సర్వేయర్లు ఏ ప్రశ్న వేసినా అటు తిరిగి ఇటు తిరిగి సర్జికల్ స్ట్రయిక్స్ గురించే విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. పాక్‌తో ప్ర«ధాని మోదీ వ్యవహరించిన తీరుకి ముగ్ధులయ్యామని, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ మాట వింటున్నాయంటే అందుకు మోదీ కారణమని ప్రశంసించారు. దివ్య తోమర్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్థి విపక్షాలు వైమానిక దాడులపై సాక్ష్యాధారాలు చూపించాలన్న డిమాండ్లపైనా మండిపడ్డారు. ‘దేశ భద్రత అంశంలో మనందరం ఐక్యంగా ఉండాలి. భారత్ ప్రభుత్వం మన రక్షణ దళానికి ఒక ఊపు వచ్చేలా వ్యవహరించింది. పాకిస్తాన్‌కు తన స్థానమేంటో గుర్తు చేసింది‘‘ అని కామెంట్ చేశారు.
మా కాళ్ల మీద నిలబడతాం
నిరుద్యోగంపై ప్రస్తావించినా విద్యార్థులు వినిపించుకునే స్థితి కొన్ని కాలేజీల్లో కనిపించలేదు. ‘ఉద్యోగాలు కూడా ఎన్నికల్లో ఒక అంశమే, కాదనలేం. కానీ కోట్లాది మందికి ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలంటే ఎలా? మాకైతే ఉద్యోగం అర్థించడం కంటే, మా కాళ్ల మీద మేము నిలబడి పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఉంది. మధ్య తరగతి వారికి మేలు చేసేలా తాజా బడ్జెట్ ఉంది’ అని దయాల్ సింగ్ కళాశాలకు చెందిన తుహానీ అరుణ్ అనే బీకామ్ విద్యార్థి చెప్పాడు.
కోటా మాకొద్దు
తరం మారుతోంది. దాంతో పాటు యువ ఓటర్ల స్వరం కూడా మారుతోంది. రిజర్వేషన్ల అంశంలో కూడా కాలేజీ విద్యార్థులు విభిన్నంగానే స్పందించారు. విద్య, ఉద్యోగ అవకాశాలు ప్రతిభ ఆధారంగా రావాలి తప్ప రిజర్వేషన్లతో కాదంటున్నారు. ‘నాకు జనరల్ కేటగిరీలో పోటీ పడాలని ఉంది. కులపరమైన రిజర్వేషన్లు మాకు అక్కర్లేదు. వాటిని రద్దు చేయాలి’ అనేది కాజల్ ప్రజాపతి అనే గ్రాడ్యుయేట్ అభిప్రాయం. విక్రాంత్ శర్మ అనే మరో యువ ఓటరు కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు ఇస్తే మంచిదన్నారు. తాజాగా అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం కోటా ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి?
తొలి ఓటర్లను ఆకర్షించే అంశంలో ఈసారి కూడా బీజేపీయే ముందుంది. ఓటరు ప్రక్రియ నమోదుకు ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ పదేపదే పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మోదీ ‘ప్రజాస్వామ్యానికి పండుగ వచ్చిందని, ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవా’లంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలో మోదీ యువశక్తి పేరిట ప్రత్యేకంగా ఒక ప్రచార విభాగం మొదలైంది. పరీక్షలకు ముందు విద్యార్థుల్ని స్వయంగా కలుసుకున్న మోదీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలపై పాఠాలు చెప్పి వారిని ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త ఆలస్యంగా మేల్కొన్నా.. యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కొన్ని చేస్తున్నారు. ‘ఆప్నీ బాత్ రాహుల్ కే సాత్’ అంటూ ఢిల్లీ రెస్టారెంట్‌లో కొందరు తొలి ఓటర్లను కలుసుకొని మాట్లాడారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ‘యువ క్రాంతి యాత్ర’ ద్వారా తొలి ఓటర్లకు గాలం వేస్తోంది. యువ ఓటర్లను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాల్లోనూ రెండు పార్టీలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి.
2014లో తొలి ఓటర్ల ‘నమో’ జపం
2014 ఎన్నికల్లో యువతరం నమో మంత్రంతో ఊగిపోయింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన వెంటనే ఆయనను యువతరానికి ప్రతినిధిగానే చూశారు. అందుకే పోలింగ్ బూత్‌లకి తరలివచ్చి కమలం వైపే మొగ్గు చూపారు. ఎన్నికల తర్వాత సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) నిర్వహించిన సర్వేలో మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో (18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు) 34 శాతం మంది బీజేపీకి ఓటు వేసినట్టు వెల్లడైంది. ఇక కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో తొలి ఓటర్ల నుంచి 19 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment