మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఐజయ్య, చిత్రంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
కర్నూలు న్యూసిటీ: నయవంచనకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు 600 హామీలిచ్చి..అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ తుంగలో తొక్కారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి జనాన్ని దగా చేయడానికి సిద్ధమయ్యారన్నారు. కావున చంద్రబాబు కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నందికొట్కూరు, పాణ్యం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో ‘నిన్ను నమ్మం బాబూ’కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నయవంచక బాబును నమ్మబోమంటూ ప్రజలు స్పష్టం చేశారు.
♦ నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న బాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో రూ.6.17 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ధర్మ పోరాటాల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి, నీరు–చెట్టు, పోలవరం, పట్టిసీమ పథకాల్లో విచ్ఛలవిడిగా దోపిడీ చేశారన్నారు.
♦ పాణ్యం మండలం ఆలమూరు, తమ్మరాజుపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
♦ వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దేవమాడ గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీగా వెళుతూ చంద్రబాబు మోసపూరిత వైఖరిని ప్రజలకు వివరించారు.
♦ కర్నూలు నగర శివారులోని కప్పల్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు భారీగా తరలివచ్చి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment