నెల్లూరు నగరంలో నిప్పో కంపెనీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ ముఖ్య నేతలు మొదలుకుని కార్పొరేటర్ల వరకు అందరూ దీనిపైనే చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టాలని భావించి కూడా నిర్ణయం వాయిదా వేసుకోవటంతో తీవ్రతర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఈనెల 10వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో నిప్పోపై చర్చించి, ఆమోదించాలని అధికార పార్టీ బలంగా యత్నాలు సాగించి క్యాష్ పైరవీలకు తెరతీయటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులోని పారిశ్రామిక వాడలో ఉన్న ఇండో నేషనల్ లిమిటెడ్ (నిప్పో) భూ మార్పిడి కోసం యజమానులు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 1973లో ఇండోనేషన్ లిమిడెట్ ప్రభుత్వం రెండు విడతలుగా 13.02 ఎకరాల భూమిని అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే భూమిని పరిశ్రమ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిప్పో యాజమాన్యం భూమార్పిడి చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం దీనిని పరిశీలించి అక్కడ నివాసాలు ఉన్నాయా లేక పరిశ్రమలు ఉన్నాయా ఈ భూమి దేనికి పనికి వస్తుందో పరిశీలించి నివేదిక పంపమని స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ క్రమంలో నుడాకు అక్కడి నుంచి నగరపాలక సంస్థకు ఈఫైల్ వచ్చింది.
1973 నుంచి నిప్పో
నగరంలోని వేదాయపాళెం ప్రాంతంలో 1973లో నిప్పో కంపెనీ ఏర్పాటయింది. 13.02 ఎకరాల భూములను సర్వే నంబర్లు 2034–2, 2038–3, 2038–1, 2034–3, 2034–3, 2034–1, 2033–4, 2032–3, 2031–2, 2038–2, 2034–2 తదితర సర్వే నంబర్లలో 13.02 ఎకరాల భూమిలో నిప్పో ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంది. ఈ భూముల్లో నిప్పో బ్యాటరీలు తయారు చేస్తూ కొందరికి ఉపాధి కల్పించింది. అయితే ఈ పరిశ్రమను తడకు తరలించడంతో మూడేళ్లుగా ఆ భూములు ఖాళీగా ఉన్నాయి.
అధికార పార్టీ నేతల పైరవీలు
ఈక్రమంలో నిప్పో పరిశ్రమ ఉన్న 13.02 ఎకరాలను భూమార్పిడి చేయటానికి వీలుగా నగరపాలకసంస్థ న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుని కౌన్సిల్‌లో తీర్మానం చేసి, దానిని నుడాకు పంపాల్సి ఉంది. దీనిని అధికార పార్టీ నేతలు ఆదాయవనరుగా మలుచుకున్నారు. అధికార పార్టీ కీలక నేతలు ఇద్దరు తెరవెనక మంత్రాంగం నడిపి భారీగా దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఒక కార్పొరేటర్ క్రియాశీలకంగా రంగంలోకి దిగి అందరి మద్దతు కూడగట్టటానికి భారీ ప్యాకేజ్‌లు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని దానిలో సగ భాగం ఇప్పటికే చెల్లించారు.
మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు
నిప్పో వ్యవహారం రెండు సార్లు కౌన్సిల్‌కు వచ్చి వెనక్కు వెళ్లడంతో నిప్పో సంస్థ నేరుగా మున్సిపల్ ముఖ్యకార్మదర్శి కరికాలవల్లవన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో 2017 డిసెంబర్ 12వ తేదీన కార్పొరేషన్ అధికారులు ఆ భూములను పరిశీలించి పూర్తి సమాచారం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలం నుడా పరిధిలో ఉండటంతో గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన నుడా వైస్‌చైర్మన్ ఢిల్లీరావుకు లేఖరాసి వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఢిల్లీరావు జనవరి 26వ తేదీన ఓ లేఖ రాస్తూ ఈ భూమార్పిడి పై కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఆమోదించి ప్రతిపాదనలు అందించాలని కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. దీంతో కౌన్సిల్ ఫిబ్రవరి 6వ తేదీన కౌన్సిల్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. అయితే వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీనిని ప్రజా అవసరాలకు వినియోగించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
బంద్ ప్రశాంతం
నెల్లూరు రూరల్: ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సవరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ జిల్లాలో దళిత సంఘాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్దకు ఉదయం ఏడు గంటలకే దళిత జేఏసీ నేతలు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఉదయం 10.30 గంటల వరకు బస్టాండ్‌లోనే నిలిచిపోయాయి. సిటీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపేశారు. ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని సవరిస్తూ విచారణ తరువాతనే కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి సూచికగా ఎస్సీ, ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్‌లో రిజర్వేషన్ల జోలికి గానీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం జోలికి వస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రధాని నరేంద్రమోదీ తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపింరు. కార్యక్రమంలో ఎమ్యార్పీఎస్ నాయకుడు జి. రమణయ్య మాదిగ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ, దళిత జేఏసీ నాయకులు కలివెల ఎలీషాకుమార్, మన్నేపల్లి దాసు, డక్కా రమణయ్య, అరుణకృపాకర్, కేవీపీఎస్ నాయకులు ఆలూరి తిరుపాలు, అల్లాడి గోపా ల్, మాలకొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment