లోక్‌సభలో మాట్లాడుతున్న మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ: నాణ్యమైన రోడ్లు కావాలనుకుంటే టోల్ ఫీజు చెల్లించక తప్పదని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లోక్‌సభలో అన్నారు. రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవన్నారు. గత అయిదేళ్లలో 40 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. టోల్ వద్ద వసూలు చేసే డబ్బు పల్లెల్లో, పర్వత ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి ఉపయోగపడతాయన్నారు. రోడ్ల విస్తరణకు భూసేకరణ దగ్గరే అసలైన సమస్య ఎదురవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అధిగమించడానికి కొత్త ప్రణాళికలు రచించాలన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వేగంగా రోడ్లను నిర్మించడం ద్వారా మోదీ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్ల విలువైన ఎన్‌పీఏలను ఆదా చేసిందన్నారు.
ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో చేరుకునేలా రహదారి నిర్మించనున్నామన్నారు. రహదారి పొడవునా పచ్చదనాన్ని పెంచుతామన్నారు. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల మీదుగా ఈ దారిని నిర్మిస్తామన్నారు. భూసేకరణలో ఈ మార్గం ద్వారా రూ. 16 వేల కోట్లను ఆదా చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, రాష్ట్ర బస్సు సర్వీసులకు టోల్ ఫీజు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేశానికి 25 లక్షల మంది డ్రైవర్ల అవసరం ఉందని, త్వరలో ప్రతి రాష్ట్రంలో ఓ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి యూరో 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తాయని, దీంతో కాలుష్యం తగ్గుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment