సాక్షి, ఏలూరు : కేంద్ర జల వనరులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో పర్యటించనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కేంద్రమంత్రి గడ్కరీ తొలిసారి పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.
ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ నేతల విమర్శలకు బీజేపీ దీటుగా కౌంటర్ ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు.
పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పీపీఏ అనుమతి లేకుండానే నామినేషన్లపై పోలవరం పనులు కట్టబెట్టారని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ పర్యటనలో పోలవరం అక్రమాలు బయటపడతాయనే ఆందోళన ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. గడ్కరీ కేవలం పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకే పరిమితం అవుతారా? లేక ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపైనా దృష్టి సారిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గడ్కరీ పోలవరం సందర్శనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment