అహ్మదాబాద్: పటీదార్ సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పీఏఏఎస్ నేత హార్థిక్ పటేల్ ప్రయత్నిస్తున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మండిపడ్డారు. పటేల్ (పటీదార్) సామాజికవర్గానికి రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. ఉట్టి బక్వాస్ అని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ కోటా హామీ అంగీకరించిన హార్థిక్ పటేల్‌ను ఫూల్ (మూర్ఖుడి)గా అభివర్ణించారు.
’కొందరు మూర్ఖులు మరికొందరు మూర్ఖులకు ఒక కాగితం ముక్కను ఇచ్చారు’ అని నితిన్ పేర్కొన్నారు. పటేల్‌కు బీసీ రిజర్వేషన్ కల్పించాలన్న తమ షరతులను కాంగ్రెస్ అంగీకరించిందంటూ హార్థిక్ పేర్కొన్న వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) గత రెండేళ్లుగా ఆందోళనలు నిర్వహించిందని, తీరా ఇప్పుడు ఆ డిమాండ్‌ను పక్కనబెట్టి కాంగ్రెస్ హామీని తలకెత్తుకుందని ఆయన విమర్శించారు. ‘సమాజంలో ఇది కులవాదాన్ని వ్యాప్తి చేసింది. మన సామాజికవర్గానికి ఉన్న ప్రతిష్టను హార్థిక్ దిగజార్చారు. సర్దార్ పటేల్, భగత్ సింగ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు’ అని నితిన్ ధ్వజమెత్తారు. అయితే, నితిన్ విమర్శలను హార్థిక్ తోసిపుచ్చారు. పటీదార్ సామాజికవర్గాన్ని ఫూల్స్ గా చూపేందుకు నితినే ప్రయత్నిస్తుందని హార్థిక్ ఎదురుదాడి చేశారు.
తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని, గుజరాత్‌లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా అంగీకరించిందని, సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేరుస్తామని ఆ పార్టీ పేర్కొందని హార్థిక్ పటేల్ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment