బిహార్ సీఎం నితీశ్‌కుమార్ (ఫైల్ ఫొటో)
పట్నా : బీజేపీతో మరోసారి తెగదెంపులకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సిద్ధమవుతున్నారా అనే సంకేతాలు వెల్లడవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి బిహార్ నాయకుడిగా నితీశ్‌కుమార్ సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయంటూ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ సారథ్యంలో జేడీ(యూ) చేస్తున్న అభివృద్ధి, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎన్డీఏ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొందుతుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈ అంశంపై స్పందించడానికి నితీశ్‌కుమార్ నిరాకరించారు. సోమవారం సీఎం అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన విలేకరులు బిహార్‌లో ఎన్డీఏ నాయకత్వం గురించి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా.. ‘ఇది చాలా ప్రత్యేకమైన వేడుక. నేను అందరి ముఖాల్లో సంతోషం చూడాలనుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు ఆ విషయాల (రాజకీయ అంశాలు) గురించి నన్నేమీ అడగవద్దంటూ’ దాటవేత ధోరణి అవలంభించారు. ‘సమయం వచ్చినప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాను. ప్రస్తుతం రంజాన్ పవిత్ర మాసంలో ఏర్పాటు చేసిన విందును ఆస్వాదించండ’ని అంటూ నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సీట్ల వాటా పెంచుకునేందుకే..
2014 ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. 40 లోక్‌సభ స్థానాలున్న బిహార్‌లో 2014లో బీజేపీ మిత్రపక్షాలతో కలిపి (ఎల్‌జేపీ, ఆర్‌ఎస్‌ఎల్పీ) 22 సీట్లు గెలుపొందింది. అయితే తర్వాత మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీతో దోస్తీ కట్టిన జేడీ(యూ) వచ్చే ఎన్నికల్లో సీట్ల వాటా పెంచుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నిరసన గళాన్ని వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment