
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ పాలనాపరమైనా లోటుమాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 18 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి మంత్రివర్గ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, మంత్రివర్గం లేకపోవడంతో సహాయ చర్యలు పూర్తిగా నిలిచిపోయాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
గతనెల 18న యడీయూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. కర్మ,కర్త,క్రీయా అంతా తానే వ్యవహరిస్తూ.. రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఇప్పటికే 54మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు సీఎం, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ మంత్రివర్గంలేకపోవడంలో అధికారుల్లో స్పష్టత కరువైంది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొక తప్పడంలేదు.
మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రానట్లు తెలుస్తోంది. మంత్రివర్గం జాబితాను యడియూరప్ప సిద్ధం చేసి పెట్టుకున్నా.. అధిష్టానం పిలుపు కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ విభజన అంశంలో బీజేపీ కేంద్ర పెద్దలు బిజీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణను కేంద్ర నాయకత్వం తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో యడియూరప్ప కూడా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేయలేకపోతున్నారు.
హైకమాండ్ పైనే భారం
నిజానికి యడ్యూరప్ప ఎప్పుడో మంత్రివర్గ విస్తరణ చేపట్టేవారని, కానీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయం పై ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దాదాపు యాభై మంది వరకూ బీజేపీ నేతలు మంత్రివర్గంలో చేరడానికి పోటీ పడుతున్నారు. కొందరు ఏకంగా అధిష్టానానికి అప్పీల్ కూడా చేసుకున్నారు. అందుకే సీఎం కూడా మంత్రివర్గ విస్తరణను అధిష్టానానికే వదిలేస్తే తాను నాలుగు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద యడియూరప్ప ముఖ్యమంత్రిగా చేపట్టిన ముహూర్తం కలిసిరాలేదేమో. పార్టీ కేంద్ర నాయకత్వం వివిధ పనుల్లో బిజీగా ఉండటం, వరదలు, వానలతో రాష్ట్రం అతలాకుతలవ్వడంతో పూర్తిగా సతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment