
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో బీజేపీపై నేరుగా విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేతకు మరొక నేత తోడయ్యారు. బాలీవుడ్ నటుడు, బీజేపీ సీనియర్ నేత శత్రఘ్న సిన్హా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేశారు. ప్రజలనుంచి వస్తున్న ప్రశ్నలను మోదీ స్వీకరించాలని, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
'భారత ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా పరిశీలనను, వ్యాఖ్యలను నేను కూడా ఆమోదిస్తున్నాను. గత రెండు రోజులుగా మన పార్టీ (బీజేపీ) వ్యక్తులకు బయటి వ్యక్తులకు ఈ విషయంలో అనూహ్య మద్దతు లభిస్తోంది. సిన్హా వ్యాఖ్యలను ప్రజలు కూడా సమర్థిస్తున్నారు. ప్రధాని ఈ విషయంలో వివరణ ఇవ్వాలి' అని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదవుతోందని, పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టినట్లయిందని, ఆర్థిక వృద్ధి రేటు పడిపోతోందని యశ్వంత్ సిన్హా అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో యూపీఏపై ఆరోపణలు చేయడంతో తప్పించుకోలేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు.