
తమిళ సినిమా (చెన్నై): తమిళనాడులో అవినీతిని అంతం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో ఒక పథకం తన వద్ద ఉన్నట్లు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూనే నటుడిగానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం 2 చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు.
అందుకు తన వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్‌లో ఒక పెద్ద పథకం ఉందన్నారు. ఆ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలో లంచం, అవినీతి వంటివి పూర్తిగా అంతం అవుతాయన్నారు. దీనికంటే తనకు సినిమా ముఖ్యం కాదని అన్నారు. స్నేహబంధం రాజకీయాలకు సహకరిస్తుందా? అని అడుగుతున్నారని, మూగజీవాలకు స్నేహ బంధం ఉంటుందనీ, అవే దాన్ని ఉపయోగించుకుంటూ ఫలం పొందుతున్నప్పుడు రాజకీయవాదులు ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ప్రశ్నించారు. తనకు నగరాల్లో కంటే గ్రామాల్లోనే అధిక అభిమాన గణం ఉందని తెలిపారు. వారికి తాను ప్రస్తుతం ఒక నటుడిగానే తెలుసుననీ, ఇకపై రాజకీయనాయకుడిగానూ ఆదరిస్తారనీ అన్నారు.