మిగిలింది మూడు రోజులే | Only Three Days Remaining For Election Campaigning In Telangana | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 3 2018 1:19 AM | Last Updated on Mon, Dec 3 2018 11:27 AM

Only Three Days Remaining For Election Campaigning In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు తిరిగామా.. లేదా.. అన్ని వర్గాలు, అన్ని సంఘాలను కలిశామా.. లేదా.. అన్న దానిపై అనుచరులతో చర్చిస్తున్నారు. కేవలం మూడ్రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు అన్ని రకాలుగా శ్రమిస్తు న్నారు. ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డి ప్రతీ ఇంటికి వెళ్లి ఓటు అడిగే ప్రయత్నం విస్తృతం చేశారు. అభ్యర్థి కుటుంబంతో పాటు బంధువర్గం, అనుచరులు ఇలా అందరూ గడపగడపకూ వెళ్లి ఓటు, బ్యాలెట్‌ పేపర్, సీరియల్‌ నంబర్‌ చెప్పి మరీ ప్రచారాన్ని చివరి దశకు చేర్చారు. అయితే ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు మరోసారి అన్ని వర్గాలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఊపందుకున్న ప్రలోభాలు
ఓటుకు రూ.500 ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడంతా ఓటుకు రూ.2 వేలు అంతకుమించి ప్రలోభాలు సాగుతున్నాయి. భారీ స్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండటంతో కొన్ని పార్టీల అభ్యర్థులు ‘పంపిణీ’లో డీలా పడ్డారు. ప్రచారం ముగిసే 5వ తేదీ నుంచి ఓటు వేసే 7వ తేదీ ఉదయం వరకు దాదాపు 40 గంటల పాటు ప్రలోభ పర్వం ఊపందుకోనుంది. కొన్ని హాట్‌సీట్లలో అభ్యర్థుల ఖర్చు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు చేరబోతోందని ఎన్నికల కమిషన్‌ అంచనా వేస్తోంది. రెండు ప్రధాన పార్టీల్లో ఉన్న కీలక నేతలు, మాజీ మంత్రుల స్థానాల నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రలోభాలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓటు బాగా కాస్ట్‌లీగా మారిపోయిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. 

‘సంఘాల’ ఓట్లకు ఎర..
గ్రామాల్లో కీలకంగా మారిన మహిళా సంఘాలకు అభ్యర్థులు ఏకంగా లక్షల రూపాయలు పంచుతున్నట్టు పోలీస్‌ శాఖ గుర్తించింది. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లో మహిళా సంఘాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో సంఘానికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వడంతో పాటు ప్రతీ మూడు గ్రూపులకు ఒక బూత్‌ కమిటీ మెంబర్‌ను ఇన్‌చార్జిగా పెట్టారు. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ సంబంధిత గ్రూపునకు ఎక్కువగా డబ్బులిస్తే, అప్పటికప్పుడు మళ్లీ డబుల్‌ చేసి ఇచ్చేలాగా కమిటీ మెంబర్‌ వద్ద రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా పెట్టారు. అదే విధంగా యువజన సంఘాలు, కుల సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో పాటు 5, 6వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రతీ గ్రామంలో పార్టీలకు కీలక అనుచరులుగా వారితో పాటు వారి వారి బంధువుల ఇళ్లలో మద్యం నిల్వ చేసినట్టు తెలిసింది. అయితే మరికొంత మంది అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వారి ఇళ్లలో మద్యం నిల్వ చేసినట్టు ఆయా పరిధిలోని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. 

దాడులకు రంగం సిద్ధం
ప్రలోభాలు తారస్థాయికి చేరుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు, తదితరుల నివాసాల్లో దాడులు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ రంగం సిద్ధం చేసింది. ఈ మేర ప్రత్యేక బృందాలను ఆదేశించినట్టు తెలుస్తోంది. కీలక నేతలుగా ఉన్న 20 నియోజకవర్గాల్లో అబ్జర్వర్లు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఒక్కో అబ్జర్వర్‌ ఒక్కో నియోజకవర్గంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో దాడులు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement