![Opinion polls Cant Declare Lok Sabha Election Results - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/4/opinion.jpg.webp?itok=5dpTooBq)
వేల మంది అభ్యర్థులు, వందలాది పార్టీలు, కూటములు, నామినేషన్‌కు ముందు రోజు కూడా పార్టీలు ఫిరాయించే జంప్ జిలానీలు.. ఇదే ఈసారి లోక్‌సభ ఎన్నికల దృశ్యం. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు నాడి పట్టుకోవడం కాకలు తీరిన ఎన్నికల విశ్లేషకులకి కూడా సాధ్యం కావడం లేదు. కేంద్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పడం కత్తి మీద సామేనని ఒపీనియన్ పోల్స్ నిర్వహించే వివిధ సంస్థలు బహిరంగంగా అంగీకరిస్తున్నాయి.
మార్పులూ..చేర్పులూ..
ఏడాది క్రితం వరకు మోదీ సర్కార్‌కు మరో చాన్స్ ఇస్తారనే అంచనాలుండేవి. కానీ గత ఏడాది 5 రాష్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. పెరిగిపోతున్న నిరుద్యోగం, గ్రామీణ రంగ సంక్షోభం, జీఎస్టీ ప్రభావం వంటివి మోదీ ప్రతిష్టను మసకబార్చాయి. దీంతో అంచనాలు మారాయి. ఇవి బలపడేలోగానే ఎన్నికలకు కాస్త ముందు పుల్వామాలో జవాన్లపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకార దాడులు మోదీ నాయకత్వంపై మళ్లీ ఒక్కసారిగా నమ్మకాన్ని పెంచాయి. ఈ ప్రభావం ఏ మేరకు బీజేపీని విజయతీరాలకు చేరుస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పొత్తులు ఖరారయ్యే వరకు ఎవరు ఎలాంటి గట్టి అంచనాలకు రాలేరన్న అభిప్రాయమైతే నెలకొంది.
అందని ఓటరు నాడి.. తగ్గిన సర్వే వాడి
ఎన్నికలకు ముందు వచ్చే ఒపీనియన్ పోల్స్, పోలింగ్ రోజు సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్‌కి ఈ మధ్య జనాదరణ పెరుగుతోంది. ఏ సంస్థ ఎలాంటి అంచనాలు వేసింది, ఆ సంస్థ చెప్పిన ప్రకారం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, ఆ సంస్థకున్న విశ్వసనీయత ఎంత మొదలైనవి చర్చనీయాంశంగా మారుతున్నాయి. భారత్‌లో 1990 తర్వాత ఆర్థిక సరళీకృత విధానాలతో మీడియా రంగానికి బూమ్ బాగా పెరిగింది. ప్రైవేటు పత్రికలు, న్యూస్ చానల్స్ రావడంతో సొంత సర్వేలు నిర్వహించడం మొదలుపెట్టాయి. 1998, తిరిగి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)తో కలిసి ఎన్నికల సర్వేలు చేసి బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పగలిగారు. గత పదిహేనేళ్లుగా ఆయన ఎన్నికల విశ్లేషణలు చేస్తున్నప్పటికీ అప్పటి మాదిరిగా ఇప్పుడు కచ్చితమైన ఫలితాల్ని చెప్పలేకపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ కాదు ఉల్టా ప్రదేశ్
ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌కు ‘ఉల్టా ప్రదేశ్’ అనే నిక్‌నేమ్ కూడా ఉంది. ఫలితాల్ని ఉల్టాపల్టా చేసే శక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఈసారి హవా ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. త్రిముఖ పోటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తులు ఎలాంటి ఫలితాలనిస్తాయి? బీజేపీకి వ్యతిరేకంగా మహాగఠ్‌బంధన్ ఎంతవరకు నిలబడుతుం ది?.. ఇవన్నీ తేలడానికి కొద్ది రోజుల సమయం ఉంది.
ఓడిపోతున్న ఒపీనియన్ పోల్స్
సర్వేలు అంత కచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పే దాఖలాల్లేవు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సంస్థలు ప్రజా నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. 2004 తిరిగి 2009 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేశాయి. ఇక గత ఎన్నికల్లో టుడేస్ చాణక్య మినహా మిగతా అందరూ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని చెప్పి బోర్లా పడ్డారు. భిన్న మతాలు, విభిన్న కులాలు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు అధికంగా ఉన్న భారతదేశంలో శాంపిల్స్ సేకరణ అత్యంత సంక్లిష్టమని ఒపీనియన్ పోల్స్ నిర్వహించే సీఎన్‌ఎక్స్ సంస్థ అంటోంది. అంతేకాదు డేటా పరిరక్షణ కోసం అమెరికా, యూరప్ వంటి దేశాల మాదిరిగా కఠినమైన చట్టాలు మన దగ్గర లేకపోవడంతో ప్రజలు తమ మనోగతాన్ని నిజాయతీగా చెప్పడానికి భయపడుతున్నారని సీఎన్‌ఎక్స్ వ్యవస్థాపకుడు భవేశ్ ఝా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment