న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు.
వారితో పాటు ఎన్సీ సభ్యులు తమ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ఇంట్లోనే నిర్బంధించడంపై నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభ్యులకు అవకాశమిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ సహా విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు. తక్షణమే ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి, సభకు హజరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోకివిపక్ష సభ్యులను అనుమతించకుండా.. ఈయూ పార్లమెంటేరియన్లను అనుమతించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ఖండించారు. పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై పోలీసులు దాడిచేసి, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె కుమార్తె చెప్పారని డీఎంకే సభ్యుడు బాలు ప్రస్తావించారు.
గత సమావేశాలు అద్భుతం
పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయన్న విశ్వాసం తనకుందన్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం. దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. గత సమావేశాలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు.
తొలిరోజే ఆందోళనలు
Published Tue, Nov 19 2019 3:53 AM | Last Updated on Tue, Nov 19 2019 8:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment