
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల విరామం అనంతరం జరగబోతున్న ఈ సమావేశాల్లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం సహా ఇతర బ్యాంకు కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు.
బ్యాంకు కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ‘ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు’ను తీసుకొస్తున్నామని పేర్కొంటూ ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు సంక్రమిస్తాయి. ఈ బిల్లుకు గురువారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాల్ని ప్రతిపక్షాలు ఇంతవరకూ ఖరారు చేయకపోయినా.. ఒకట్రెండు రోజుల్లో సమావేశం కావచ్చని తెలుస్తోంది. బ్యాంకు కుంభకోణాలతో పాటు దళితులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, రైతుల సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం తదితర అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ అరెస్టు నేపథ్యంలో.. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపును పార్లమెంటులో నిలదీస్తామని ఆనంద్ శర్మ తెలిపారు. సమావేశాలపై సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. పీఎన్‌బీ కుంభకోణం ఎలా చోటుచేసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ తీరును ఉభయ సభల్లో ఎండగడతామని తృణమూల్ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు.
పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
బడ్జెట్ సమావేశాల మలిదశలో సాధారణంగా వివిధ శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతాయి. అలాగే ఆమోదం కోసం ఉభయ సభల్లో ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ)బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు, డెంటిస్ట్స్ (సవరణ) బిల్లును మంగళవారం ప్రవేశపెడతారు. మోటారు వాహనాల(సవరణ) బిల్లు 2017, ద స్టేట్ బ్యాంక్స్(రద్దు, సవరణ) బిల్లు 2017ను సమావేశాల మొదటి రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపుల్ని కేంద్రం ముమ్మరం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment