నన్ను తప్పించాలని చూస్తున్నారు | Opposition wants to get rid of me, I want to get rid of terrorism | Sakshi
Sakshi News home page

నన్ను తప్పించాలని చూస్తున్నారు

Published Mon, Mar 4 2019 4:31 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Opposition wants to get rid of me, I want to get rid of terrorism - Sakshi

అమేథీలో ఏకే–203 తుపాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మోదీ

పట్నా: దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని తాను ప్రయత్నిస్తుంటే తనను పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. పట్నాలో ఆదివారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్న ఎన్డీఏ ‘సంకల్ప్‌ర్యాలీ’లో ఆయన మాట్లాడారు. వైరి దేశం పాక్‌కు లాభించేలా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.  ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో ఆ దేశ నాయకత్వం చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు.

‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం నన్ను తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారు. దేశమంతా ఒకే గొంతుక వినిపించాల్సిన ఈ సమయంలో 21 పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశమై ప్రభుత్వ చర్యలను ఖండించారు. మన జవాన్లు చూపిన ధైర్య సాహసాలపై వారికి ఆధారాలు చూపాలట’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ‘పేదల పేరుతో రాజకీయాలు సాగించేవారు, తమ వారసత్వ రాజకీయాలను తప్ప ఎవరినీ పట్టించుకోరు. వీరికి చౌకీదార్‌తోనే ఇబ్బందులున్నాయి. కానీ, చౌకీదార్‌ చాలా జాగ్రత్తగా తన కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు’ అని తిప్పికొట్టారు. కాగా, మోదీ, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కలిసి 2009లో పంజాబ్‌లోని లూథియానాలో ఇలా ఒకే వేదికపై కనిపించారు. 2005 ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్డీఏ  ర్యాలీకి జనాన్ని తరలించేందుకు 18 రైళ్లు, 5వేల బస్సులను వినియోగించారు.

అమేథీలో ఏకే–203
7 లక్షల రైఫిళ్ల తయారీ లక్ష్యం
పట్నా సభ అనంతరం ప్రధాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ సొంత నియోజకవర్గం అమేథీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ.. ‘గత ఎన్నికల్లో ఈ సీటు మేం గెలవలేకపోయినా మీ హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించగలిగాం. ఇక్కడ గెలిచిన వారి(రాహుల్‌) కంటే కూడా కేంద్రమంత్రి స్మృతీఇరానీ చాలా అభివృద్ధి పనులు చేపట్టారు’ అని అన్నారు. ‘భారత్‌–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే–203 రైఫిళ్లపై ‘మేడ్‌ ఇన్‌ అమేథీ’ అని ఉంటుంది. ఉగ్రవాదులు, మావోయిస్టులపై జరిపే పోరాటంలో మన జవాన్లకు ఇవి ఎంతో సాయపడతాయి. వీటితో అమేథీకి ఇక కొత్త గుర్తింపు లభించనుంది’ అని మోదీ తెలిపారు. కాగా, 2014 ఎన్నికల తర్వాత అమేథీలో మోదీ పర్యటించడం ఇదే ప్రథమం.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సందేశం
అమేథీలో తయారయ్యే ఏకే–203 రైఫిళ్లతో భారత రక్షణ బలగాల చిన్న ఆయుధాల అవసరాలు తీరుతాయని రష్యా అధ్యక్షుడు  పుతిన్‌ పేర్కొన్నారు. ఆయన పంపిన సందేశాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అమేథీ సభలో చదివి వినిపించారు. ‘ఈ కర్మాగారం భారత రక్షణ– పారిశ్రామిక రంగం జాతీయ రక్షణ సంస్థల చిన్న ఆయుధాల తీర్చగలుగుతుంది. ఇందుకు రష్యా ఆధునిక సాంకేతికత తోడవుతుంది.  దశాబ్దాలుగా సైనిక, సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న సహకారంతో భారత్‌లో 170కిపైగా సంస్థలను నెలకొల్పాం’ అని  పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పుతిన్‌ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ కర్మాగారంలో 7 లక్షల రైఫిళ్లను తక్షణం తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ప్రస్తుతం భద్రతా బలగాలు వాడుతున్న ఇన్సాస్‌ రైఫిళ్ల స్థానంలో అందజేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement