విజయవాడ: దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయటమే మా అంతిమ లక్ష్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడ నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో బీజేపీ ఆధ్వర్యంలో భారత్ కే మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాంమాధవ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వ్యాపారవర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం రాంమాధవ్ విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
వీర జవానుల కుటుంబాలను మా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మన్‌కీ బాత్.. మోదీ కే సాత్ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని వెల్లడించారు. మోదీ జగన్నాధ రథాన్ని ఎన్ని ప్రతిపక్షాలు కలిసినా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అవినీతి, అసమర్థపాలన ఏపీలో కొనసాగిందని, మార్చిలో బీజేపీ విజన్ డాక్యుమెంట్(మ్యానిఫెస్టో) విడుదల చేస్తామని చెప్పారు. 85 శాతం హామీలు ఏపీలో అమలు చేశామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడానికి ఏపీ ప్రభుత్వ జాప్యమే కారణమని వివరించారు.
ఐదేళ్లలో చరిత్రాత్మక నిర్ణయాలు: కన్నా
పేదరిక నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఐదేళ్లలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు మోదీ తీసుకున్నారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి ఏమి చెయ్యాలో చర్చించామని, అలాగే వివిధ రంగాల వారి సలహాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment