జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలకు ఓకే  | Panchayat elections by January 10 | Sakshi
Sakshi News home page

జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలకు ఓకే 

Published Tue, Dec 11 2018 3:00 AM | Last Updated on Tue, Dec 11 2018 3:00 AM

Panchayat elections by January 10 - Sakshi

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. మూడు నెలల్లోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సింగిల్‌ జడ్జి ఈ ఏడాది అక్టోబర్‌ 11న తీర్పునిచ్చారని, ఈ మేరకు 2019 జనవరి 10లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలీసు భద్రత, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది. ఎన్నికల సంఘాని (ఈసీ)కి పూర్తి సహాయసహకారాలు అందిస్తామంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వీటన్నింటినీ కూడా ఈసీకి తెలియజేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సింగిల్‌ జడ్జి.. 
కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్పంచ్‌ల సంఘంతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ఈ ఏడాది అక్టోబర్‌ 11న తీర్పు వెలువరిస్తూ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారులను నియమించడాన్ని తప్పుపడుతూ.. వారి నియామకానికి ఉద్దేశించిన జీవో 90ని రద్దు చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి రాష్ట్రప్రభుత్వం సహకరించకపోవడాన్ని జస్టిస్‌ రామచంద్రరావు తన తీర్పులో తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం సహకరించనప్పుడు హైకోర్టును ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందే అవకాశమున్నా, ఈసీ ఆ పని చేయకపోవడాన్ని తప్పుపట్టారు. 

హైకోర్టును ఆశ్రయించిన ఈసీ 
దీంతో ఈసీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది.  పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నిర్దిష్ట కాల వ్యవధిలోపు బీసీలతో సహా అన్ని రిజర్వేషన్లను ఖరారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. గడువు ముగిసినా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంలో తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం వల్లే తాము ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని, అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement