పార్థసారధి (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు 1500 రోజుల పాలనలో అవినీతి, అన్యాయం, అరాచకం తప్ప అభివృద్ధి కనిపించడంలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 1500 రోజుల పాలనపై చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని, రాష్ట్రం మాత్రం అవినీతిలో కూరకుపోయిందని విమర్శించారు.
‘చంద్రబాబు సీఎంగా ఉంటే ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా ఎప్పటికీ కాలేదు. సూర్యోదయ రాష్ట్రం కాదు సూర్యాస్తమయ రాష్ట్రంగా మార్చారు. మీకు దమ్ముంటే 1500 రోజుల పాలనపై ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా? నాలుగేళ్ల పాలనలో అభూత కల్పనలు, అబద్ధాలు ప్రచారం చేశారు. కేంద్రంతో లాలూచీ పడి ముడుపులు తీసుకున్నారు. చంద్రబాబు ప్రజల ముందు దొంగ దీక్షలు చేస్తున్నారు. దొంగ దీక్షలు చంద్రబాబు నైజాం. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన స్వార్థం కోసం, ముడుపుల కోసం కేంద్రం నుంచి బలవంతంగా తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీకి కూడా చాలని డబ్బులిచ్చి రుణమాఫీ అంటున్నారు’ అని పార్థసారథి మండిపడ్డారు.
బలహీన వర్గాలకు రూ. 750 కోట్లు మాత్రమే ఇచ్చి గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గలేదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘ప్రజలు నిన్ను తుంగలో తొక్కే అవకాశం కోసం చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే వైఎస్సార్‌సీపీ జపం చేస్తున్నారు. చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నా.. బీజేపీతో వైఎస్సార్‌సీపీ పొత్తు పెట్టుకుంటే నేను నా కుంటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటాం. జగన్ మోహన్ రెడ్డి మాటపై మాకు నమ్మకం ఉంది. టీడీపీ నేతలకు చంద్రబాబుపై నమ్మకం ఉందా?’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment