సాక్షి, న్యూఢిల్లీ : శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానంద చేరికతో దక్షిణాదిన బీజేపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయన సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటామన్నారు. ఇన్నాళ్లు ఆయన ఆశీస్సులు బీజేపీకి ఉన్నాయని, ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన చేరికతో తెలంగాణ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించేందుకు వీలవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతోపాటు ప్రచారం నిర్వహిస్తామన్నారు.
సామాన్య కార్యకర్తలా చేరుతున్నా..
బీజేపీలో తన చేరికపై ఎలాంటి ముందస్తు షరతులు లేవని, సామాన్య కార్యకర్తలాగే పార్టీలో చేరానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. నవరాత్రి దీక్ష అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’అనే హిందూ సంస్కృతిని రాజకీయ కోణంలో ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’కల సాకారం చేసేందుకు బీజేపీ చేస్తోన్న కృషి తనను ఆలోచింపజేసిం దన్నారు. ధర్మాన్ని నిలుపుకోకపోతే ఈ దేశానికి ఉనికేలేదని, దాన్ని కాపాడేందుకే పార్టీలో చేరానని చెప్పారు. మోదీ, అమిత్ షా, రాం మాధవ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని, వారు నిర్ణయిస్తే ఎక్కడిౖMðనా వెళ్లి సేవ చేస్తానని పేర్కొన్నారు.
ఎన్నికల కోణంలో చూడాల్సిన అవసరం లేదు: రాం మాధవ్
స్వామి పరిపూర్ణానంద చేరికను ఎన్నికల కోణంలో చూడాల్సిన అవసరం లేదని రాం మాధవ్ అన్నారు. ఆయన సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. స్వామీజీలను పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీపై ఉన్న మతోన్మాద పార్టీ ముద్ర మరింత బలపడే అవకాశం ఉంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. దేశ సేవ కోసం ఎవరైనా తమ పార్టీలో చేరవచ్చని, గతంలో అనేక మంది బీజేపీలో చేరి సేవ చేస్తున్నారని రాం మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే టీడీపీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీపై టీడీపీ విమర్శలు చేస్తోందని రాంమాధవ్ అన్నారు. ఐటీ దాడుల విషయంలో ఆదాయపన్ను శాఖ ప్రాథమిక ఆధారాలతోనే సోదాలు జరుపుతోందని, ఈ విషయంలో బీజేపీ ప్రమేయం లేదన్నారు. ఐటీ దాడుల్లో టీడీపీ నేతల లొసుగులు బయటపడుతుండటంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలను రాం మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా బలపడేందుకు కృషి చేస్తోందని, రాష్ట్రంలో మరే ఇతర పార్టీతోనూ తమకు లోపాయికారీ ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment