రాజ్యసభలో నినాదాలు చేస్తున్న విపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో శుక్రవారం ఐదో రోజూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే సోమవారానికి వాయిదాపడింది. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ మహాజన్ దక్షిణ కొరియా పార్లమెంటరీ ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. వెంటనే వివిధ పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసనలకు దిగారు. పీఎన్‌బీ కుంభకోణంపై కాంగ్రెస్, టీఎంసీ.. ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ.. రిజర్వేషన్ కోటా పెంచాలని టీఆర్‌ఎస్.. కావేరి బోర్డు ఏర్పాటు, పెరియార్ విగ్రహం ధ్వంసంపై ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు, ప్లకార్డులతో ఆందోళనలు చేపట్టారు.
దీంతో స్పీకర్ 50 నిమిషాలసేపు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయ్యాకా నిరసనల హోరు కొనసాగటంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే తీరుగా నిరసనలు సాగాయి. పీఎన్‌బీ కుంభకోణం, ఏపీకి ప్రత్యేక హోదాపై సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసనలకు దిగారు. దీంతో స్పీకర్ వెంకయ్య సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాతా నినాదాల హోరు సాగటంతో సభ సోమవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment