మాస్క్ ధరించి పార్లమెంటుకు వచ్చిన ఎంపీ నవనీత్ కౌర్ రవి రాణా
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో గత వారం జరిగిన అల్లర్లపై పార్లమెంట్‌లో ప్రభుత్వం చర్చ చేపట్టే వరకు ఉభయసభల్లో కార్యకలాపాలు కొనసాగ నీయబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో గొడవలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడో రోజైన బుధవారం కూడా కార్యకలాపాలు స్తంభించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ హింసపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. హోలీ పండగ అనంతరం ఈ నెల 11వ తేదీన లోక్‌సభలో, 12న రాజ్యసభలో దీనిపై చర్చ చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
సంతృప్తి చెందని కాంగ్రెస్‌కు చెందిన 30 మంది సహా, ఇతర ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిలబడి ‘హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని మోదీ బాధ్యత వహించాలి’అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా లేకపోవడంతో అధ్యక్షస్థానంలో ఉన్న కిరీట్ సోలంకి సభా కార్యక్రమాలను నడిపించారు. దీంతో సభ్యులు.. ‘స్పీకర్ ఎక్కడ?, మాకు న్యాయం కావాలి’అంటూ కేకలు చేశారు. ఈ ఆందోళనల నడుమనే ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’బిల్లును, ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐటీలు)లకు జాతీయ ప్రాముఖ్య హోదా కల్పించే బిల్లులను ఆమోదించింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన రెండు ప్రశ్నలకు బొగ్గు శాఖ మంత్రి కూడా అయిన జోషి బదులిచ్చారు. చంద్రయాన్–3 ప్రాజెక్టును 2021 ప్రథమార్ధంలో చేపట్టనున్నట్లు లోక్‌సభకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యమవుతుందన్నారు.
మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మైక్రోగ్రావిటీపై ఆరు పరీక్షలు జరుగుతాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గందరగోళం కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు, ఆతర్వాత రోజంతా వాయిదా పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హింసకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇదే మా డిమాండ్. చర్చ జరిపేదాకా ఉభయసభల లోపల, వెలుపల నిరసనలు కొనసాగిస్తాం’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ..‘అల్లర్లపై మాట్లాడేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏమాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చర్చ సాగితే సభా కార్యకలాపాలను కొనసాగనిస్తాం. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
రాజ్యసభలోనూ అదే సీను
ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ డిమాండ్ చేశాయి. హోలీ తర్వాత చర్చకు చేపట్టనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను తిరస్కరించాయి. ఎజెండాను పక్కనబెట్టి ఢిల్లీ అల్లర్లపైనే చర్చించాలంటూ నిబంధన–267 కింద ప్రతిపక్షాలిచ్చిన నోటీసును చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. అయితే, ఏ అంశంపై, ఏ విధానం ప్రకారం చర్చ జరగాలనే విషయమై రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానని తెలిపారు. ప్రతిపక్షం నిరసనలు ఆగకపోవడంతో ఆయన.. ‘దేశంలో కోవిడ్ వ్యాప్తి సహా 16 అంశాలపై జీరో అవర్‌లో జరగాల్సిన చర్చను అడ్డుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టుంది’ అని వ్యాఖ్యానిస్తూ తర్వాతి రోజుకు సభను వాయిదా వేశారు. హోలీ సందర్భంగా 9, 10వ తేదీల్లో పార్లమెంట్‌కు సెలవులు.
Comments
Please login to add a commentAdd a comment