
సాక్షి, హైదరాబాద్ : ఘోర ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోతే... చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారథి మీడియా మాట్లాడారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచంలోని అత్యంత అవినీతి ప్రపంచమన‍్న ఆయన.. మంత్రులతో సహా ప్రతీ నేత కూడా దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. నీరు-చెట్టు కింద సుమారు 100 కాంట్రాక్టులను కావాల్సిన వారికే కట్టబెట్టుకున్నారని.. ఇసుక నుంచి మట్టి వరకు అంతా దోచుకుంటున్నారన్నారు. పవిత్ర సంగమాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేస్తున్నారని.. మరి టూరిస్ట్ స్పాట్ గా ప్రకటన చేసుకుంటున్న చంద్రబాబు.. ప్రజల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని పార్థసారథి ప్రశ్నించారు. గతంలో హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించటంలో విఫలమవుతూ ప్రజల ప‍్రాణాలు పోయేందుకు బాధ్యుడవుతున్నారన్నారు. అనుమతులు లేని బోట్లు తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.
ఘటన తర్వాత లైఫ్ జాకెట్లు, సాయం చేసేందుకు వచ్చిన వారిపై దాడికి యత్నించారని ఆయన అన్నారు. మృతుల బంధువులు రాకుండానే పోస్టు మార్టం పూర్తి చేయటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బోటు ప్రమాద ఘటనను పక్కదారి పట్టించేందుకే యజమాని, డ్రైవర్ పై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారని.. మరి ప్రభుత్వం తరపున వైఫల్యంపై విచారణకు ఆదేశించారా? అని అడిగారు. అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవటం కాదని... వెంటనే ఇరిగేషన్ మంత్రి, మంత్రి అనుచరులు, టూరిజంశాఖ అధికారులపై కూడా దర్యాప్తు చేయించాలని.. సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ముడుపులు దండుకోవటం కోసమే పోలవరం ప్రాజెక్ట్ హైపవర్ కమిటీని రద్దు చేశారని తెలిపారు. బోటు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పార్థసారథి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment