సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ పొత్తులు, పదువుల కోసమే ఆరాటమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బద్ద శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌లు కలయికని రాష్ట్రమంతా విడ్డూరంగా చూస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నాయకుడు అంటే జగనే అంటున్నారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే నాయకుడు జగన్ అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. చంద్రబాబు లక్ష్యం కుర్చీ, అధికారమే అని ఆరోపించారు. చంద్రబాబు వేసే పిచ్చి వేషాలకు ఓ వర్గం మీడియా మద్దతుగా నిలవడం దారుణమని మండిపడ్డారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి అధికారం లాక్కున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఏ సిద్ధాంతం కోసం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవని అన్నారు. కేంద్రం చేసిన ప్రతి విషయంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు రెండూ అన్యాయం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్‌లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు వెంటనే బయటకు రావాలని పిలుపునిచ్చారు. డెమోక్రసీ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment