సాక్షి, అమరావతి: ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరిపితే టీడీపీ నేతలు ఎందుకు బెంబేలెత్తుతున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తదితరులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపితే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పేర్కొంటున్న టీడీపీ నేతలు గురివింద నీతిని మర్చినట్లున్నారన్నారు. హరికృష్ణ చనిపోయిన సమయంలో పరామర్శకు వచ్చిన కేటిఆర్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుందామని అడిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లు అన్పించలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఛీ...పో అని చెప్పారు కాబట్టే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు ప్రకటించిన విషయం ప్రజలందరికి తెలుసు అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన పరిణామాలు రాష్ట్రానికి శుభపరిణామంగా భావిస్తున్నాం అన్నారు. జగన్ వారితో చర్చలు జరిపితే టీడీపీ నేతలు కుక్కల్లా మొరగడం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.
టీఆర్‌ఎస్ పార్టీతో వైఎస్సార్‌సీపీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదన్న విషయం గుర్తించాలన్నారు. మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్న రెండు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టవచ్చనే ఆలోచనతోనే ఫెడరల్ ఫ్రంట్‌పై ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిపారు. దీనికే భయపడి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నానా యాగి చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని కేసీఆర్ చెబుతున్నపుడు వారితో సంప్రదించడం తప్పా అని టీడీపీ నేతలను అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతూ వారికి అనుకూల ఛానళ్లలో విమర్శలు, ఆరోపణలతో సిద్ధమైపోవడం దారుణం అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే వ్యక్తులు బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. జాతీయ పార్టీలు బలహీనపడి ప్రాంతీయ పార్టీలు బలపడుతున్న ఈ దశలో ప్రాంతీయ పార్టీలు ఒక తాటిపైకి రావడం శుభపరిణామం అన్నారు. ఈ అంశంలో చంద్రబాబు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అయోమయానికి గురికావద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం బాధాకరం...
వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం బాధాకరం అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజకీయలబ్ధి కోసం ఏదైనా మాట్లాడే చంద్రబాబు రాజకీయప్రత్యర్థుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీసేందుకు నీచ సంస్కృతికి తెరతీస్తున్నారన్నారు. గతంలో కూడా షర్మిలపై సోషల్ మీడియాలో అపవాదులు వేసి ప్రచారం చేశారు. ఈ విషయాలను ప్రజలందరూ తెలుసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment