చంద్రబాబుకు పార్థసారధి సవాల్‌ | YSRCP MLA Kolusu Parthasarathy Challenge to Chandrababu over Sand Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పార్థసారధి సవాల్‌

Published Wed, Nov 13 2019 3:32 PM | Last Updated on Wed, Nov 13 2019 7:06 PM

YSRCP MLA Kolusu Parthasarathy Challenge to Chandrababu over Sand Issue - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి ఎద్దేవా చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని, లేకుంటే రేపు (గురువారం) చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

పార్థసారధి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా.  ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలి. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. లేదంటే రేపు చంద్రబాబు చేసే దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? 

టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌ అబద్ధాల పుట్ట. బీసీ నేతలను టార్గెట్‌ చేస్తూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుది. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే బాబు దీక్ష. నదుల్లో వరద ఉధృతంగా ఉండటం వల్లే కొంత ఇసుక కొరత ఉంది. వరద తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో ఇసుక లభిస్తుంది. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. 

వ్యవస్థలను నాశనం చేసి నాడు చంద్రబాబు అవినీతికి పట్టం కట్టారు. ఇప్పుడు తన తాబేదారు పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. టీడీపీ, జనసేన ఒకే తానులో ముక్కలు’  అని మండిపడ్డారు. మరోవైపు విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద రేపు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్థసారధి ...నగర పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement