చినరాజప్ప ఆనందరావు
తూర్పుగోదావరి, అమలాపురం: కోనసీమ కేంద్రం అమలాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కీలక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు రాలేదని కొంతమంది కినుక వహిస్తే.. పదవులు పొందినవారు సహితం అసంతృప్తితో ఉండడం విశేషం. అధికారంలో ఉండడంతో నిన్నటివరకూ గుంభనంగా ఉన్న నేతలు.. ఎన్నికల వేళ ఒక్కసారిగా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు.
♦ అల్లవరం మండలంలో పట్టున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు పనిగట్టుకుని విజయవాడ వెళ్లి ఆ ర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. ఆనందరావుకు టి క్కెట్ ఇవ్వద్దని కుండబద్దలుగొట్టి మరీ చెప్పారు. సాధారణంగా అమలాపురం టీడీపీ అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేది ఈ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అయినప్పటికీ అల్ల వరం నాయకులు యనమలను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ నందరావును రాజప్ప బహిరంగంగా వెనకేసుకు వస్తున్నారనే ఉద్దేశంతో జిల్లాలో సీనియర్ అయిన యనమలను వారు కలిశారు. ఇలా ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.
♦ ముఖ్యంగా పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు ఆనందరావు, చినరాజప్పల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి, ప్రజారాజ్యం వచ్చిన సమయంలో టీడీపీని వదిలి వెళ్లిన నాయకులకు దక్కిన పదవులు తమకు రాకుండా పోయాయని వారు మండిపడుతున్నారు.
♦ పార్టీలో సీనియర్‌గా ఉన్న రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మట్ట మహాలక్ష్మి ప్రభాకర్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని స్వయంగా రాజప్ప హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నామినేటెడ్ పదవుల పందేరం జరిగిన ప్రతిసారీ ప్రభాకర్ పేరు వినిపించడం తరువాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది.
♦ అలాగే మున్సిపాలిటీ ఇన్‌చార్జి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఉన్న పెచ్చెట్టి విజయలక్ష్మికి సైతం తిరిగి వైస్ చైర్మన్ ఇవ్వడం లేదు. జెంటిల్‌మెన్ ఒప్పందం అమలు కోసం ఆమె పదవిని వదులుకున్నారు. చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నా ప్రస్తుత చైర్మన్ యాళ్ల నాగసతీష్, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల ఆమెకు పదవి దక్కలేదు. పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామా చేసినా తిరిగి తనకు పదవి ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు.
♦ ఇక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న పెచ్చెట్టి చంద్రమౌళి తాను ఆశించిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ రాలేదన్న అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
♦ కాంగ్రెస్ హయాంలో గోదావరి ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్‌గా పని చేసి, పార్టీకి సేవలందించిన సత్తి శ్రీను సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం నీటిసంఘం అధ్యక్షుడు కూడా కాలేకపోయారు.
♦ పదవులు అనుభవించిన నేతలు సైతం పార్టీ పెద్దలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
♦ అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రెండేళ్లు పని చేసిన గునిశెట్టి చినబాబు రెండోసారి అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
♦ జెంటిల్మన్ ఒప్పందంలో భాగంగా నిర్ణీత గడువుకన్నా ఎక్కువ రోజులు పదవుల్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, అమలాపురం మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు సైతం ఇదే తీరుతో ఉన్నారు.
♦ గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గం పట్టణ పార్టీ పెద్దల తీరుపై నిరసన తెలుపుతోంది. వీరిలో కొందరు జనసేన వైపు, మరికొందరు వైఎస్సార్ సీపీ వైపు వెళ్లిపోయారు. వీరే కాకుండా పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పలువురిని ఆనందరావు, రాజప్ప పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయంలో మరింతమంది పార్టీ మారే అవకాశముందని టీడీపీ వర్గాలు భయపడుతున్నాయి.
♦ అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొత్తవారిని తీసుకువస్తారని, ప్రస్తుత ఎమ్మెల్యేకు అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీలో అసంతృప్తులు, అసమ్మతి రాగాలు బహిరంగం కావడం రాజప్ప, ఆనందరావులకు మింగుడుపడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment